కొవిడ్ టీకా పంపిణీలో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ముందస్తు సన్నాహకాల్లో(డ్రై రన్) కొవిన్ సాఫ్ట్‌వేర్ ముప్పుతిప్పలు పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1,200 కేంద్రాల్లో టీకా పంపిణీకి సంబంధించిన డ్రై రన్‌ను నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించినా.. సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా శుక్రవారం 917 చోట్ల మాత్రమే నిర్వహించాల్సి వచ్చింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 21,777 మంది లబ్ధిదారులు డ్రై రన్‌లో పాల్గొన్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమం విజయవంతమైనట్లు పేర్కొన్నారు.
రెండు రోజుల్లో తేదీలు ఖరారు
కొవిడ్ టీకా ముందస్తు సన్నాహకాలను పరిశీలించడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ఆరోగ్య కేంద్రాలను శ్రీనివాసరావు సందర్శించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో డ్రైరన్‌ను పరిశీలించి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రై రన్‌లో పిన్ కోడ్ గుర్తించడంలో సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ములుగులో ఇంటర్నెట్ ఇబ్బందులున్నాయని చెప్పారు. వాటిని అధిగమించడానికి చర్యలు చేపడతామన్నారు. టీకా పంపిణీకి రెండు రోజుల్లో తేదీ ఖరారు కావచ్చన్నారు.