రెండు కన్నీటి బిందువుల విలువకు ఈ ప్రపంచంలో ఏదీ సరితూగలేదంటారు. కన్నీళ్లు మాట్లాడతాయి, కానీ భాషలేదు. ఆ ఆవేదనాశ్రువుల గొంతును పరమ ప్రభువు అయిన అల్లాహ్ మాత్రమే వినగలుగుతాడు. అందుకే దుఃఖాన్ని ప్రార్థనతో పోల్చారు. ‘ఎవరినీ కష్టపెట్టకండి, ఎవరినీ కన్నీరు పెట్టించకండి... ఎందుకంటే వారి ఆవేదన మీకు శాపంగా మారుతుంది. భరించలేనంత దుఃఖంతో మీ గుండె, నీటి పొరలతో మీ కళ్లు నిండిపోతే ప్రభువుతో మాట్లాడండి. అల్లాహ్‌కు నీ కష్టాల గురించి తెలుసు కానీ మననోటి నుంచి వినాలనుకుంటాడు.’ అంటారు ఉలమాలు. రెండు బొట్లు అల్లాహ్‌కు ఎంతో ప్రీతికరమైనవి. మొదటిది పాపభీతితో కార్చే కన్నీటి బొట్టు... రెండోది ధర్మమార్గంలో కార్చే రక్తపు బొట్టు. చెంపలపైనుంచి జాలువారే ఆ కన్నీరు భగభగమండే నరకాగ్నికీలల్ని చల్లారుస్తుందంటారు ప్రవక్త మహనీయులు. అల్లాహ్ భీతితో ఏ నేత్రాలైతే కన్నీళ్లు కార్చుతాయో అలాంటి వ్యక్తిని నరకాగ్ని నీడకూడా తాకలేదని చెబుతారు ప్రవక్త.
మనం చేసే పాపాల వల్ల హృదయానికి తుప్పుపడుతుంది. దాన్ని వదిలించే గుణం కేవలం కన్నీళ్లకే ఉంటుందంటారు హజ్రత్ సయ్యద్ నా సాలెహ్ మురీద్. గుండెను ప్రక్షాళనం చేసే మందు కేవలం కన్నీరే అంటారాయన. మనిషి పాపాల వల్ల మనసు మలినమవుతుంది. పాపం చేసిన ప్రతిసారీ హృదయంలో నల్లని మచ్చ ఏర్పడుతుంది. పాపాలు మితిమీరిపోతే హృదయమంతా నల్లబారిపోతుంది. అప్పుడు గుండెను ప్రక్షాళన చేయడం కేవలం పశ్చాత్తాపంతో రాల్చే కన్నీటిబొట్లకే సాధ్యమవుతుంది.