ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాల పిల్లలకు ఎడ్యుకేషన్ మెంటరింగ్ అండ్ ఎంపవరింగ్ స్టూడెంట్స్ మోటివ్తో టీం-సంభవ ఏర్పాటైంది. హైదరాబాద్ నగరానికి చెందిన కొంత మంది యువత.. ఉద్యోగాలు చేసుకుంటూనే.. గివింగ్ బ్యాక్ టూ సొసైటీలో భాగంగా... వీకెండ్స్‌లో సోషల్ సర్వీస్ చేసేందుకు నడుం బిగించారు.
అలా ప్రారంభమైంది..
అనంతపురానికి చెందిన సద్గురునాథ్, జయశ్రీ దంపతులు టీం-సంభవను ఏర్పాటు చేసి.. ప్రభుత్వ పాఠశాలలు, అనాథశరణాలయాల పిల్లలతో వారం వారం ఇంటరాక్ట్ అయ్యేవారు. వారిలో ఉన్న అంతర్గత నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సాహించటం, స్టేజ్ ఫియర్ పోగొట్టడం, మానసికంగా వారిని దృఢం చేసేవారు. వీరి ఆశయానికి నగరవ్యాప్తంగా 250 మంది వాలంటీర్ల మద్దతు తోడైంది. ప్రస్తుతమున్న పరిస్థితులకు అనుగుణంగా... కొవిడ్ బారినపడి ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నవారి కొరకు టీం-ఉజ్వలను ప్రారంభించారు.
వారి కష్టాల గురించే బాధ...
టీం- సంభవ ఫౌండర్ సద్గురునాథ్ కుటుంబంతో సహా.. జులైలో కోవిడ్ బారిన పడి.. ప్రభుత్వ కొవిడ్ కేర్‌లో వారంరోజుల పాటు చికిత్స తీసుకున్నారు. మరో వారంపాటు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు. ఆ సమయంలో తోటి స్నేహితులు, బంధువులు, వైద్యులు ఇచ్చిన మద్దతుతో కరోనా మహమ్మారి నుంచి వేగంగా బయటపడ్డారు. అదే సమయంలో అయినవారు కూడా పట్టించుకోక, కేర్ టేకర్స్ లేక అవస్థలు పడే బాధితుల కష్టాలు ఆయనను కదిలించాయి.
కరోనా మహమ్మారి బారినపడితే.. ఫిజికల్‌గా కన్నా.. మానసికంగా, సాంఘిక బహిష్కరణతో ఎక్కువ నష్టం వాటిల్లుతుందని గ్రహించి.. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి తమ టీం ద్వారా సహాయపడాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా టీం- ఉజ్వలను ప్రారంభించి.. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న కొవిడ్ బాధితులకు సర్వీస్ అందజేస్తున్నారు.
సర్వీసు అందిస్తూ..
టీం- ఉజ్వల ద్వారా 50 మంది వాలంటీర్లు కొవిడ్ కేర్ సేవలు అందిస్తున్నారు. వైరస్ బారినపడ్డ వ్యాధిగ్రస్తులకు సైకలాజికల్ కౌన్సిలింగ్, కేర్ టేకర్స్, ఫిజికల్ సపోర్ట్ లేని వారికి నిత్యావసరాలు, చికిత్సలో ఉపయోగపడే మందులు వంటివి తమ వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ వైద్యున్ని నియమించి.. రోగికి రోజుకు ఓ గంట మెడికల్ కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. ఈ క్రమంలో వారు వైరస్ బారినపడకుండా శిక్షణ పొంది.. వ్యక్తిగత భద్రతా ప్రమాణాలు పాటిస్తూ జాగ్రత్త వహిస్తున్నారు.