కరోనా కట్టడి, ఆర్థిక కార్యకలాపాలు, లాక్‌డౌన్ గడువు పొడిగింపు తదితర ముఖ్యాంశాలపై రాష్ట్రప్రభుత్వం నేడు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంగళవారం జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ అంశాలపై చర్చించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో లాక్‌డౌన్‌కు ఇచ్చిన గడువు ఈనెల 7 వరకు ఉంది. కేంద్రం ఈనెల 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నందున.. దీన్ని అనుసరిస్తూనే రాష్ట్రంలోనూ ఈ నెల 28 వరకూ పొడిగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. వీటితోపాటు పదో తరగతి, వివిధ పోటీ పరీక్షల అంశం, కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపైనా మంత్రిమండలిలో చర్చించనున్నారు.
మద్యం అమ్మకాలు లేనట్లేనా!
కరోనా కేసుల పరిస్థితి ఆధారంగా కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో మద్యం విక్రయాల అనుమతి ముఖ్యమైంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది. మద్యం అమ్మకాలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులతో పాటు వివిధ రంగాల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించారు. క్షేత్రస్థాయిలో మద్యం వద్దనే వినతులు పలు వర్గాల నుంచి వచ్చినట్లు తెలిసింది. మద్యం రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి కావడంతో తర్జనభర్జనలు పడుతున్నారు.
సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మద్యం దుకాణాలు తెరిచారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తెలంగాణవాసులు ఆ దుకాణాలవద్ద బారులు తీరారు. అక్రమ రవాణాకూ ఆస్కారం ఉంది. మద్యం విక్రయాల్లో భౌతిక దూరం సాధ్యంకాదన్న విషయం ఏపీలో మొదటిరోజే రుజువైంది. ఈ పరిస్థితుల్లో మద్యం దుకాణాలకు అనుమతి నిరాకరించడం లేదా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అమ్మకాలకు పరిమిత అనుమతుల వంటి ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం అనుమతిస్తే ఎలాంటి విధివిధానాలుండాలనే అంశంపై సోమవారం ఆబ్కారీశాఖ ఉన్నతాధికారులు చర్చించినట్లు సమాచారం.
మహమ్మారి కట్టడి ఎలా?
జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పట్టినా రాజధాని హైదరాబాద్‌లో ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి వైరస్‌ను వ్యాప్తిని తగ్గించడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు, వైద్యనిపుణులతో చర్చించారు. ఆరెంజ్, గ్రీన్ జోన్ జిల్లాల్లో రవాణా సౌకర్యాలతో పాటు ఇతర సడలింపులు ఇచ్చే వీలుంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు. ఆదాయం తగ్గడంతో ఖజానా నిర్వహణ సమస్యగా మారింది. ఉద్యోగుల జీతభత్యాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు, కరోనా నియంత్రణ చర్యలకు ఇబ్బందులను ఎలా అధిగమించాలి, కేంద్ర సాయం తదితరాలపై చర్చించనున్నారు.
అక్కడ ఎలాంటి సడలింపులు ఇవ్వవద్దు
కరోనా వైరస్ సోకుతున్న వారిలో, ఈ వైరస్‌తో మరణిస్తున్న వారిలో అత్యధిక శాతం మంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల వారే ఉంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సడలింపులు ఇవ్వవద్దని వారు సీఎంను కోరారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితారాణా తదితరులు పాల్గొన్నారు. సోమవారం మూడు కేసులు నమోదు కావడం, 40 మంది కోలుకుని డిశ్ఛార్జి కావడం శుభసూచకమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వైద్య శాఖ అధికారులు ప్రభుత్వానికి తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించారు.
ఇదీ చూడండి:కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్