TDPP Letter to pm Modi and Home minister Amit shah: ఆంధ్రప్రదేశ్లో కురిసిన అకాల వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని.. జాతీయ విపత్తుగా ప్రకటించి సహకారం అందించాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు.. తెదేపా పార్లమెంటరీ విజ్ఞప్తి చేసింది. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి భయానకంగా మారిందన్న టీడీపీపీ.. రోడ్డు, రైలు మార్గాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయని తెలిపింది.
అపార పంట నష్టం
Heavy rains and floods in AP: భారీ వర్షాల వల్ల జాతీయ రహదారులకు గండ్లు పడటంతో.. ఎక్కడికక్కడ రాకపోకలు ఆగిపోయినట్లు తెదేపా పార్లమెంటరీ నేత గల్లా జయదేవ్ లేఖలో వివరించారు. ఈ మేరకు మోదీ, అమిత్ షాకు ఆయన విడివిడిగా లేఖలు రాశారు. ఇప్పటికీ వందల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం పునరుద్దరణ జరగలేదని.. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 24 మంది మృతి చెందారని... 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి ప్రజల జీవనాధారం దెబ్బతిన్నదని లేఖలో పేర్కొన్నారు.
పట్టణాలు, గ్రామాలను వరద ముంచెత్తడంతో.. ప్రజలు నీరు, ఆహారం, ఔషధాలు సహా.. నిత్యావసరాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గల్లా జయదేవ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించి.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, దెబ్బతిన్న జాతీయ రహదారులు, రైలు మార్గాలను పునరుద్దరించేందుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కోరారు. పంట నష్టంతో జీవనాధారం కోల్పోయిన రైతులను ఆదుకునేలా ఎక్స్‌గ్రేషియా అందించాలని... చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Nellore rain today: ఏపీలోని నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల వల్ల వాగులు పొంగుతున్నాయి. జిల్లాలోని పలు గ్రామాలు, కాలనీలు జలమయమయ్యాయి. నెల్లూరు భగత్‌సింగ్‌కాలనీ జలదిగ్బంధంలో ఉండగా.. వెంకటేశ్వరపురంలోని టిడ్కో ఇళ్లు నీటమునిగాయి. నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో.. పొర్లుకట్టలు కోతకు గురయ్యాయి. జిల్లాలోని ఇందుకూరుపేట పేట మండలం ముదివర్తి పాలెం వద్ద ఉన్న పెన్నా పొర్లు కట్ట తెగిపోవడంతో 5 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. ముదివర్తి పాలెం, నిడు ముసలి, కె ఆర్ పాలెం, రాముడు పాలెం గ్రామాలు జలదిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. కృష్ణపట్నం చిన్న తూముల వద్ద విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరద పోటెత్తడంతో పెన్నా నది(penna river flood) తీరంలోని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వరద తీవ్రతకు బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాల్లో పోర్లుకట్టలు కోతకు గురయ్యాయి. ఫలితంగా వరద ప్రవాహం గ్రామాలపై పడి, నివాసాలను ముంచెత్తింది. బుచ్చి మండలంలోని పెనుబల్లి, మినగల్లు, కాకులపాడు, దామరమడుగు, పల్లిపాలెం గ్రామాల్లోకి వరద నీరు చేరింది.
ఇదీ చదవండి:nellore rain today: రహదారులపై పొంగుతున్న వరద.. రాకపోకలు నిలిపివేత