వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్.. కార్యకర్తలతో కలిసి ఉండవల్లిలోని.. చంద్రబాబు నివాసం ముట్టడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జగన్ సహా మంత్రులపై ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జోగి రమేశ్ నిరసనకు యత్నించడం, వారిని బుద్దా వెంకన్న సహా ఇతర తెదేపా నాయకులు ప్రతిఘటించే ప్రయత్నం చేయడం.. యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఇరు పార్టీల నాయకులు పరస్పర నినాదాలు, దూషణలతో.. ఘటనా స్థలం రణరంగాన్ని తలపించింది.
ఏం జరిగింది..
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. కార్యకర్తలతో కలిసి జోగి రమేశ్ చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. వారిని బుద్దావెంకన్న సహా ఇతర తెదేపా నాయకులు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొందరు వైకాపా కార్యకర్తలు తమ వెంట తెచ్చుకున్న జెండా కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల మోహరింపుతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు బారికేడ్లు పెట్టి ఇద్దరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. ఇరువర్గాలూ ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో వారిని నిలవరించేందుకు పోలీసులు కష్టపడ్డారు. లాఠీలు ఝళిపించారు.
జోగి రమేష్, బుద్ధా వెంకన్న మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చంద్రబాబు ఇంటి దగ్గర నిరసన ఎందుకు చేపడుతున్నారంటూ బుద్ధా నిలదీశారు. అదే సమయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య పరస్పర నినాదాలతో హోరెత్తించారు. ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాటలు చేటుచేసుకున్నాయి. ఈక్రమంలో బుద్ధా వెంకన్న స్వల్ప అస్వస్థతకు గురై.. సొమ్మసిల్లి కిందపడిపోయారు.