TDP state wide agitation: ఏపీలోని గుంటూరులో తెలుగుదేశం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తెలుగుదేశం కార్యాలయం వద్ద తెలుగు మహిళ, తెలుగు యువత ఆధ్వర్యంలో.. మాధవ్ దిష్టి బొమ్మతో నిరసన యాత్ర నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను లాక్కునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు, తెలుగుదేశం శ్రేణులకు మధ్య వాగ్వాగం, తోపులాట జరిగింది. పోలీసులు లాక్కెళ్లగా తెలుగుదేశం నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి, వైకాపా నాయకత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ నాయకులు ఆరోపించారు. ఎంపీ మాధవ్ వ్యవహారాన్ని.. లోక్‌సభ స్పీకర్ సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పదవి నుంచి తొలగించాలంటూ.. కాకినాడలో తెలుగుదేశం మహిళా విభాగం నేతలు నిరసనలు చేపట్టారు. మాజీ మేయర్ సుంకర పావని.. ఆందోళన నిర్వహించారు. వైకాపా నాయకుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా.. సీఎం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో.. తెలుగుదేశం నేత ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ భవన్ నుంచి అంబేడ్కర్ కూడలి వద్దకు ర్యాలీగా వెళ్లి.. రాస్తారోకో నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. గుంతకల్లులోని పొట్టి శ్రీరాములు కూడలిలో తెలుగుదేశం నాయకులు ఎంపీ మాధవ్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తల చేతిలోని దిష్టి బొమ్మను.. పోలీసులు లాక్కున్నారు. హిందూపురంలోని అంబేడ్కర్ కూడలి వద్ద..టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాధవ్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.