వ్యవసాయ చట్టాలపై వైకాపా దిల్లీలో ఓ డ్రామా.. గల్లీలో మరో డ్రామా ఆడుతోందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. ఫేక్ పార్టీ, ఫేక్ ఫెలోస్ అనే నైజం వైకాపాలో మరోమారు రుజువైందని మండిపడ్డారు. రాజ్యసభ వేదికగా విజయసాయి రెడ్డి, తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ చేసిన ప్రసంగాల వీడియోలను పట్టాభిరామ్ ప్రదర్శించారు.
'వ్యవసాయ బిల్లులపై ఒక్కమాట కూడా మాట్లాడకుండా విజయసాయిరెడ్డి గుడ్డిగా సమర్థించారు. కనీస మద్దతు ధర అంశంపై నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. రాజ్యసభలో విజయసాయి చేసిన వీరోచిత పోరాటాన్ని వ్యవసాయ మంత్రి కన్నబాబు ఓసారి పరిశీలించాలి. రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఆరోజు సవరణలు ప్రతిపాదించలేదు.'