TDP ROUND TABLE MEETING: మూడు రాజధానులపై ప్రైవేటు బిల్లు పెట్టిన పార్టీ.. ప్రజలను మభ్యపెట్టి, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నం చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ తెదేపా కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మాన ప్రసాదరావుకి విశాఖ రాజధాని మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని.. భూములు కాజేసిన చరిత్ర ఆయనదన్నారు.
అమరావతి రైతులు ఎలా వస్తారని బొత్స, తమ్మినేని ప్రశ్నిస్తున్నారని అంధ్రప్రదేశ్ మీ జాగీరా అని అచ్చెన్నాయుడు నిలదీశారు. రాజధాని లేకపోయినా విశాఖ అభివృద్ధి జరుగుతుందని దేశంలో ఇప్పటికే అగ్రశ్రేణి పది నగరాల్లో ఒకటిగా విశాఖ ఉందన్నారు. రాజధానిలా లేకపోయినా విశాఖ అభివృద్ధి జరుగుతూనే ఉంటుందన్నారు. మూడు ముక్కలాడితే అభివృద్ధి జరగదని విశాఖలో మొత్తం దోపిడి జరుగుతోందన్నారు.
ప్రజలు తిరగబడకపోతే.. రేపు ఇళ్లలోంచి బయటకు తీసుకువచ్చి ఆక్రమించే పని జరిగినా అశ్చర్యపోనవసరం లేదని అచ్చెన్నాయుడు చెప్పారు . అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి అనే దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని.. తెలుగుదేశంపార్టీ, అచ్చెన్నాయుడు ఒకటే మాటమీద ఉంటారన్నారు. అమరావతి రాజధాని, ప్రత్యేక హోదా గురించి ఎప్పుడైనా మట్లాడావా అని జగన్ని సూటిగా ప్రశ్నించారు.