తెలంగాణ

telangana

ETV Bharat / city

ముఖ్యమంత్రి సొంత నియోజవర్గంలోనే సారా ఏరులై పారుతోంది: లోకేశ్​ - ap illicit liquor news

కల్తీ సారా, నాసిరకం మద్యాన్ని నిషేధించాలని డిమాండ్​ చేస్తూ.. ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం ఆందోళనలు చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అబద్ధాలే శ్వాసగా బతికేస్తున్నారు అని మండిపడ్డారు. జంగారెడ్డిగూడెం మరణాల మీద సీఎం జగన్​ వ్యాఖ్యను తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు.

tdp
tdp

By

Published : Mar 19, 2022, 9:16 PM IST

ఏపీని కల్తీ సారా, జె- బ్రాండ్ల మద్యాన్ని నిషేధించాలని తెదేపా డిమాండ్​ చేసింది. జగన్​ నియోజకవర్గం పులివెందులలోనే నాటు సారా ఏరులై పారుతుంటే.. ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థంచేసుకోవచ్చాని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. పులివెందుల నియోజకవర్గంలోనే 2021 జనవరి నుంచి ఇప్పటి వరకూ 300 కేసులు నమోదయ్యాయని.. ఇక రాష్ట్రవ్యాప్తంగా సారా మరణాలకు అంతులేదని లోకేశ్‌ విమర్శించారు. ‘నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపమేమైనా మీకు ఉందా జగన్ రెడ్డి గారు?. అబద్ధాలే శ్వాసగా బతికేస్తున్నారు. జంగారెడ్డిగూడెం లాంటి పట్టణంలో నాటు సారా కాస్తారా? అని సీఎం అమాయకంగా అడిగారు. ఇప్పుడు మీ సొంత ఊరు పులివెందులలోనే నాటు సారా బట్టీలు బయటపడ్డాయి. దీనికి మీరు ఏం సమాధానం చెపుతారు?' అని లోకేశ్​ ప్రశ్నించారు.

ప్రజల దృష్టి మరల్చేందుకు తెరపైకి పెగాసెస్

జగన్ రెడ్డి.. సొంత బ్రాండ్లతో నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి పదింతలు ఎక్కువ ఆదాయాన్ని జగన్ రెడ్డి గ్యాంగ్ సారా, గంజాయి, డ్రగ్స్​తో పొందుతున్నారన్నారు. ఎక్సైజ్ శాఖ ఈ మూడేళ్లలో జరిపిన మద్యం అమ్మకాలు, ఆదాయం, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత, సారా మరణాలు, అప్పుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పెగాసెస్ పేరును తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. పెగాసెస్ పేరుతో తెలుగుదేశంపై బురద వేయాలనుకుంటే అది వారిపైనే పడుతుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

జగన్​రెడ్డి సాగిస్తున్న మద్యం, సారా అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు డిమాండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై ఎయిమ్స్ డాక్టర్లతో స్టడీ చేయించి అసలు దోషులను శిక్షించాలని కోరారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దేశంలో ఏ వ్యక్తి చేయని విధంగా రాష్ట్రంలో మద్యం, నాటుసారా విక్రయాలకు తెరలేపారని ఆనంద్​బాబు దుయ్యబట్టారు. తన దోపిడీ కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు.

శ్వేతపత్రం విడుదల చేయగల దమ్మూ ఉందా

కల్తీ సారా, మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో మాదిరి పరిహారం ఇవ్వాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి డిమాండ్‌ చేశారు. తనకు చెడ్డపేరు రాకూడదన్న దురుద్దేశంతోనే నాటుసారా మరణాలను సహజమరణాలుగా పేర్కొంటున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మంతా.. ముఖ్యమంత్రి ఖజానాకు చేరుతున్న వాస్తవాన్ని ప్రజలంతా గమనించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మద్యం అమ్మకాలు, మద్యం తయారీ వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయగల దమ్మూ ముఖ్యమంత్రికి ఉందా..? అని జీవీ రెడ్డి నిలదీశారు.

ఇదీ చదవండి:యూట్యూబర్​తో కలిసి పబ్​కు వెళ్లారు.. కొబ్బరి బొండాల్లో మద్యం తాగారు..

ABOUT THE AUTHOR

...view details