ఏపీలో మీడియా సంస్థలపై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన జీవో నంబరు 2430ను రద్దు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆ జీవోపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. ఆంక్షల పేరుతో మీడియాను గుప్పిట్లో పెట్టుకునేందుకు వైకాపా సర్కారు యత్నిస్తోందని ఆరోపించారు.
ఇష్టారీతిన వ్యవహరిస్తోంది
సభాపతి, మంత్రులను ముఖ్యమంత్రి జగన్ డమ్మీలుగా మార్చి ప్రతి అంశంపైనా ఆయనే స్పందిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక వైకాపా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. విద్యుత్ స్తంభాలనూ వదలకుండా పార్టీ రంగులు వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా బోధనలో ఆంగ్ల మాధ్యమానికి తాము వ్యతిరేకమంటూ తెదేపాపై ప్రభుత్వం బురద జల్లుతోందని చంద్రబాబు మండిపడ్డారు. తమ హయాంలోనే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామంటే వైకాపా అడ్డుపడిందన్నారు.