ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లా అభివృద్ధే లక్ష్యంగా తాము ముందుకెళ్లామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి తామేం చేశామో చెబుతున్నామన్న ఆయన.. గత 14 నెలల్లో వైకాపా ప్రభుత్వం ఏ జిల్లాకు ఏం చేసిందో చెప్పగలరా అని ప్రశ్నించారు. సమగ్రాభివృద్ధికి తెదేపా నాంది పలికిందని అన్నారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది ప్రజలు గ్రహించాలని సూచించారు.
నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానానికి తీసుకొచ్చాం. జలవనరులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. ఈపాటికి పూర్తికావాల్సిన పోలవరం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో అంతా గమనించాలి. అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశాం. వరుసగా నాలుగేళ్లు రెండంకెల వృద్ధి సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దాం. వ్యవసాయాన్ని ఆధునికీకరించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాం. రహదారులు, విద్యుత్ ఇలా అన్ని రంగాల్లో సమస్యలు అనతికాలంలోనే అధిగమించాం.
-చంద్రబాబు, తెదేపా అధినేత