ఏపీ రాజధాని అమరావతి కోసం చిన్న పిల్లలు సైతం రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి నిర్వహిస్తోన్న ర్యాలీలో పాల్గొన్న ఆయన.. జై అమరావతి.. జైజై అమరావతి అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. రాజధానిగా అమరావతి ఉండేలా వేంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు. ఇంద్రుడు పాలించిన దేవతల రాజధాని పేరు కూడా అమరావతే అన్న ఆయన.. శాతవాహనుల కాలం నుంచి అమరావతి కేంద్రంగా పరిపాలన జరిగిందని గుర్తుచేశారు. అమరావతిని ఎందుకు మారుస్తున్నారని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు. ఐకాస ర్యాలీలో పాల్గొనకుండా తెదేపా నేతలను అరెస్టు చేశారని ఆరోపించారు.
రాజధాని అంటే వారికి అపహాస్యమైంది..!
తనను ర్యాలీలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాజధాని అంటే వైకాపా నేతలకు అపహాస్యంగా ఉందని ఆరోపించారు. రాజధాని ఎందుకు మారుస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా నాగరికత వెలిసింది నదీతీరాల్లోనే అని స్పష్టం చేశారు. అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని మోదీ అని గుర్తు చేసిన చంద్రబాబు.. సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మారతాయా? అని నిలదీశారు. హైదరాబాద్ లాంటి రాజధాని ఏపీకి వద్దా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు రాజధాని కట్టుకోలేని అసమర్థులని తెలంగాణ వాళ్లు నవ్వుకుంటున్నారన్నారు. జగన్ ప్రభుత్వ పరిపాలన వల్ల 15 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మనల్ని చూసి తెలంగాణ వాళ్లు నవ్వుకుంటున్నారు : చంద్రబాబు ఇదీ చూడండి: వెలగపూడిలో కలకలం... రైతుల ఇళ్లల్లోకి పోలీసులు!