ఏపీ పరిషత్ ఎన్నికల్లో తెదేపా అనుసరించాల్సిన విధానంపై నిర్ణయాధికారాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకే వదిలేస్తూ తెలుగుదేశం పొలిట్‌బ్యూరో ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ ప్రక్రియలో బలవంతపు ఏకగ్రీవాలు జరిగినందున కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని తాము కోరితే.. పాత నోటిఫికేషన్ ప్రకారం షెడ్యూల్ విడుదల చేయడాన్ని తెదేపా తప్పుబట్టింది. ఎన్నికలు బహష్కరించాలని మెజార్టీ నేతలు పొలిట్ బ్యూరోలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్‌లు మాత్రం పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్నందున.. వారి పరిస్థితి ఏమిటనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. 25 శాతం స్థానాలు ఏకగ్రీవమైతే 75 శాతం స్థానాల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సబబు కాదని వారు అన్నట్లు తెలుస్తోంది. స్థానిక పరిస్థితుల దృష్ట్యా పోటీలో ఉన్న అభ్యర్థులకే నిర్ణయాధికారాన్ని వదిలేసి పార్టీపరంగా మాత్రం దూరంగా ఉండాలనే అభిప్రాయాన్ని ఇంకొందరు నేతలు వెలిబుచ్చారు. ఎన్నికలు బహిష్కరిస్తున్నామని పార్టీపరంగా ప్రకటించి.. పోటీ చేయాలా వద్దా అనేది బరిలో ఉన్న అభ్యర్థుల ఇష్టమంటూ ప్రకటన ఇవ్వడం సబబు కాదని సీనియర్లు స్పష్టం చేశారు.