తెలంగాణ

telangana

ETV Bharat / city

TTDP New President : తెదేపా రాష్ట్రశాఖ కొత్త సారథిపై కసరత్తు - tdp planning to elect new president for telangana

తెలంగాణ తెలుగుదేశం పార్టీ (TTDP)కి నూతన అధ్యక్షుడి ఎంపికపై పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. తెతెదేపా అధ్యక్షుడి పదవికి ఎల్.రమణ రాజీనామా చేయడం వల్ల ఆ స్థానం ఎవరికి ఇవ్వాలనే విషయంపై యోచనలు చేస్తోంది. రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నర్సింలు, నన్నూరి నర్సిరెడ్డి వంటి సీనియర్ నేతల పేర్లపై చర్చ జరుగుతోంది.

who is next ttdp president
తెదేపా రాష్ట్రశాఖ కొత్త సారథిపై కసరత్తు

By

Published : Jul 10, 2021, 6:54 AM IST

తెలుగుదేశం రాష్ట్ర(TTDP) శాఖకు కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీ కసరత్తులు చేస్తోంది. సీనియర్‌ నేతల్లో పార్టీకి విధేయులుగా ఉన్నవారి పేర్లను పరిశీలిస్తోంది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ తెదేపాకు రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం పార్టీ అధినేత చంద్రబాబుకు రాసిన లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో రమణ స్థానంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి పలువురు సీనియర్‌ నేతలపేర్లపై చర్చ సాగుతోంది.

అందరి కంటే సీనియర్‌, సౌమ్యుడిగా పేరొందిన పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డికి పదవి అప్పగించాలని కొందరు సూచించారు. పార్టీ జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి, సీనియర్‌ నేతలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవిందకుమార్‌ గౌడ్‌ తదితరుల పేర్లపైనా చర్చ సాగుతోంది.

బడుగువర్గాలకు చెందినవారికి ఇవ్వాలని పార్టీ నిర్ణయిస్తే బక్కని నర్సింలుకు లేదా మంచి వాగ్ధాటి గలవారికి ఇవ్వాలనుకుంటే నన్నూరి నర్సిరెడ్డికి దక్కవచ్చని అంచనా. రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఇంకా పూర్తిస్థాయి చర్చలు జరగలేదని, అధినేత చంద్రబాబు అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెదేపా తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త కంభంపాటి రాంమోహన్‌రావు చెప్పారు.

బతుకుతెరువు కోసమే వెళుతున్నారు

తెరాసలోకి వెళుతున్న రమణలాంటి నేతలు వారి బతుకు తెరువు కోసమే తెదేపాను వీడుతున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ ఆక్షేపించారు. ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు, గన్నోజు శ్రీనివాసాచారి, అధికార ప్రతినిధి శ్రీనివాస్‌ నాయుడులతో కలిసి శుక్రవారం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీనివాసాచారి మాట్లాడుతూ హుజూరాబాద్‌ ఉప ఎన్నికలున్నందున బలహీనవర్గాలకు చెందిన రమణను తెరాసలో కేసీఆర్‌ చేర్చుకుంటున్నారని, ఎన్నికలయ్యాక ఆయన్ను పక్కనపెట్టేస్తారని వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ రమణ ఇంతకాలం తెరాసకు కోవర్ట్‌లా పనిచేశారని ఆరోపించారు.

శుక్రవారం రోజున తెతెదేపా అధ్యక్షుడి(TTDP) పదవికి ఎల్.రమణ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా.. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం అయ్యేందుకే పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన తెదేపా, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details