తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకువస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్‌కు బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో ఉన్న అంశాలకు సంబంధించిన లోటుపాట్లు, వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. గెజిట్‌ను పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తానని తెలిపారు. ఏపీ ప్రాజెక్టులన్నీ కేంద్ర పరిధిలోకి వెళ్లటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం చేసిన చంద్రబాబు, ఏపీ ప్రయోజనాలు కాంక్షించే వారెవ్వరూ దీనిని స్వాగతించరని ప్రభుత్వాన్ని ఉద్దేశించి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సీఎంల మూర్ఖత్వం కారణంగానే నదీ జలాలపై కేంద్రం పెత్తనం చేజిక్కించుకుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య బంధాలు, అనుబంధాలు, బంధుత్వాలు, స్నేహాలు సజీవంగా ఉన్నాయన్నారు. మన సీఎంలు కట్టిన ప్రాజెక్టుల మీదకు మన ఇంజినీర్లు వెళ్లాలంటే సీఐఎస్ఎఫ్ బలగాల అనుమతి కావాల్సిన దుర్గతి ఏర్పడిందని ఆక్షేపించారు. చివరకు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసే ప్రమాదం కనిపిస్తోందన్న సోమిరెడ్డి.. వెలిగొండ ప్రాజెక్టును మాత్రం విస్మరించి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ లాంటి చిన్న ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం పెత్తనమేంటని ప్రశ్నించారు. వీటిపై రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లా వాసులు లోతుగా చర్చించి ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రానికి అన్యాయం చేసేలా నోటిఫికేషన్...
ఏపీకి తీవ్ర అన్యాయం చేసేలా ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ ఉందని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత, పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు విమర్శించారు. వివాదాలకు తావులేని ప్రాజెక్టులను సైతం నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తీసుకురావటానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసమర్థతే కారణమని దుయ్యబట్టారు. 2015లో రెండు తెలుగురాష్ట్రాల మధ్య జరిగిన ఉమ్మడి ఒప్పందం, 2016లో జారీ అయిన డ్రాప్ఠ్ నోటిఫికేషన్ల ఆధారంగా రీనోటిఫికేషన్ ఇచ్చేలా కేంద్రంపై జగన్ రెడ్డి ఒత్తిడి తీసుకురావాలని రామానాయుడు డిమాండ్ చేశారు.
ఏపీ నీటి హక్కులు హరించే విధంగా, భవిష్యత్తులో రైతులకు సాగునీటి ఇబ్బందులు కలిగేలా కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఉందన్నారు. వివాదాలకు తావున్న ఉమ్మడి ప్రాజెక్టుల్ని కాకుండా ఏ మాత్రం సంబంధం లేని 107 ప్రాజెక్టుల్ని బోర్డుల పరిధిలోకి తీసుకురావటం రాష్ట్ర ప్రయోజనాలకు ముఖ్యంగా రాయలసీమ ప్రయోజనాలకు, గోదావరి పరివాహక ప్రాంతానికి తీవ్ర నష్టం చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.