‘ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అన్యాయం చేసినవారు ఎక్కడున్నా పట్టుకొస్తాం, చట్టప్రకారం శిక్షిస్తాం. తెలుగుదేశం అధికారంలోకి రాగానే కమిషన్ వేస్తాం.. పోలీసులు, అధికారులకు చెబుతున్నా.. తప్పుడు కేసులు పెడితే రేపు అనేది ఉందని మర్చిపోవద్దు’ అని తెదేపా అధినేత చంద్రబాబు(ChandraBabu Naidu) హెచ్చరించారు.
‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు కార్యకర్తలంతా ఉక్కు సంకల్పంతో రావాలి. ఎవరిమీదైనా కేసులు పెడితే నేను చూసుకుంటా. మీరేమీ లక్షల కోట్లు దోచుకున్న వాళ్లు కాదు తప్పుడు కేసులు పెడితే రికార్డు చేయండి. లాయర్లను పెట్టుకుని వాదిద్దాం. ఆ అధికారిపై ప్రైవేటు కేసు పెడదాం. తెదేపా వచ్చాక మీపై కేసులు లేకుండా చేస్తా’ అని కార్యకర్తలకు బాబు(ChandraBabu Naidu) హామీ ఇచ్చారు. 36 గంటల నిరాహారదీక్ష చేపట్టిన ఆయన.. శుక్రవారం రాత్రి 8.30కు విరమించారు. వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని నిప్పులు చెరిగారు.
‘డీజీపీ కార్యాలయం, బెటాలియన్‌కు సమీపంలోని తెదేపా కార్యాలయంపై ప్రభుత్వ ఉగ్రవాదంతోనే దాడి చేశారు. డీజీపీ అనుకుని ఉంటే ఇది జరిగేదా? పట్టాభిపై గతంలో దాడి చేశారు. మొన్న ఆయన ఇల్లు నాశనం చేశారు. ఆయన కుమార్తె మానసికంగా కోమాలోకి వెళ్లే పరిస్థితికి తెచ్చారు. అయినా దాడిచేసిన వారిపై కేసు లేదు. తెదేపా కార్యాలయాలపై జరిగిన దాడుల విషయంలో సీబీఐ విచారణ చేయించాలి. దోషుల్ని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రం నాశనమైపోతోందనే రాష్ట్రపతి పాలన అడుగుతున్నాం. ప్రభుత్వ ఉగ్రవాదానికి చరమగీతం పాడాలని కేంద్రాన్ని కోరుతున్నాం. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు సమయం అడిగాం. రాష్ట్రంలోని పరిణామాలను వివరిస్తాం’ అని చంద్రబాబు(ChandraBabu Naidu) చెప్పారు.
‘పట్టాభి ఏదో తిట్టారంట.. ‘ఆ’ పదమే ఎప్పుడూ వినలేదు. ఆయన ఏదో మాట్లాడారని రీసెర్చి చేసి.. తల్లినీ లాక్కొచ్చారు. తల్లిపై ఎంత మమకారం జగన్‌రెడ్డీ? మీరు జైలుకు పోయినప్పుడు తల్లిని ఊరూరూ తిప్పారు. నన్ను కౌంటర్ చేయడానికి ఆ చెల్లి జగనన్న బాణం అని పాదయాత్ర పెట్టారు. ఇప్పుడా బాణం తెలంగాణలో తిరుగుతోంది. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని మీరు.. నాకు నీతులు చెబుతారా?’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డిని నేనే చంపానని చెప్పారు. ఎన్నికలయ్యాక వివేకానందరెడ్డి కూతురు సీబీఐ విచారణ కావాలని కోర్టుకు వెళ్తే సహకరించడం లేదు’ అని చంద్రబాబు(ChandraBabu Naidu) ధ్వజమెత్తారు.
తప్పుడు నివేదికలు తయారు చేయడంలో జగన్ సిద్ధహస్తుడు
‘తెదేపా కార్యాలయంపై దాడికి వచ్చిన ఒకరు దారి తెలియక దాక్కున్నారు. అతన్ని తెదేపా నేతలు మీడియా ఎదుటే పోలీసులకు అప్పగించారు. పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయినా కేసు నమోదు చేయలేదు’ అని చంద్రబాబు ఆగ్రహం వెలిబుచ్చారు. ‘లోకేశ్ హైదరాబాద్‌లో ఉంటే ఆయనపై కేసు పెట్టారు. నాదెండ్ల బ్రహ్మం కార్యాలయంలో లేకున్నా.. ఆయనపై కేసు పెట్టి అరెస్టు చేశారు. తప్పుడు నివేదికలు తయారుచేయడంలో జగన్‌రెడ్డి సిద్ధహస్తుడు. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, రామానాయుడు స్పీకర్‌ను ఏదో అన్నారని శాశ్వతంగా సస్పెండ్ చేస్తారట’ అన్నారు. ‘మేం బూతులు మాట్లాడామంటున్నారు.. ఎవరు మాట్లాడుతున్నారో ప్రజల వద్దకు వెళ్లి రెఫరెండం కోరుదామా? జగన్‌రెడ్డీ.. సవాల్‌కు సిద్ధమా?’ అని పేర్కొన్నారు.