తెలుగుదేశం శాసనసభాపక్షం తెరాస శాసనసభాపక్షంలో విలీనమైంది. తెలుగుదేశం తరఫున ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు టీడీఎల్పీని తెరాస శాసనసభాపక్షంలో విలీనం చేశారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు.
కేసీఆర్‌తో భేటీ
శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు తెరాస శాసనసభాపక్షంలో విలీనం కావాలని తీర్మానించినట్లు లేఖ ఇచ్చారు.
అనంతరం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఇద్దరు ఎమ్మెల్యేల విజ్ఞప్తి, తెరాస శాసనసభా పక్షనేత అంగీకారం మేరకు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి... టీడీఎల్పీని తెరాస శాసనసభాపక్షంలో విలీనం చేశారు. అందుకు అనుగుణంగా సభలో తెరాస సభ్యులతో పాటే సండ్ర, మెచ్చాలకు సీట్లు కేటాయించనున్నారు.
104కు పెరిగిన తెరాస బలం
తాజా పరిణామాలతో శాసనసభలో తెరాస బలం 104కు పెరిగింది. 12 మంది కాంగ్రెస్ సభ్యుల విలీనం తర్వాత తెరాస బలం 99 కాగా... ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచిన కోరుకంటి చందర్, స్వతంత్రంగా గెలిచిన రాములు నాయక్ కూడా గులాబీపార్టీతోనే ఉన్నారు. నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్ సన్తో ఆ సంఖ్య 102 అవుతుంది. తాజాగా ఇద్దరి విలీనంతో తెరాస బలం 104కు పెరిగింది. మజ్లిస్‌కు ఏడుగురు, కాంగ్రెస్‌కు ఆరుగురు, భాజపాకు ఇద్దరు సభ్యులు ఉండగా... ఒక స్థానం ఖాళీగా ఉంది.
ఇదీ చూడండి:వామన్‌రావు హత్య కేసులో పోలీసుల నివేదికపై హైకోర్టు సంతృప్తి