TDP Leaders Visit Jangareddygudem: ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నాటుసారా మృతుల కుటుంబాలను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు పరామర్శించారు. పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున.. మొత్తం 27కుటుంబాలకు రూ.27లక్షలు పరిహారం అందజేశారు.
తొలి ఫేక్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి
జే బ్రాండ్ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్యేలకు వాటాలు దక్కనందుకే కల్తీసారా వ్యాపారం మొదలుపెట్టారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. శాసనసభలో అసత్యాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డిని గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర భారత దేశంలో తొలి ఫేక్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. జంగారెడ్డి గూడెం మరణాలపై కనీసం వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా సహజమరణాలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.ఏపీలో పెగాసెస్ తెదేపా ప్రభుత్వం కొనలేదని మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆర్టీఐకి సమాధానం ఇచ్చిన దానిపై సీఎం ఏం చెప్తారని ప్రశ్నించారు.
తండ్రి తాగితేనే కుమారుడికి అమ్మ ఒడి ..
గత ప్రభుత్వ హయాంలో రూ.6వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని రూ.16వేల కోట్లకు పెంచుకోవటమే జగన్ రెడ్డి చేపట్టిన మద్య నిషేధమా అని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ నిలదీశారు. తండ్రి తాగితేనే కుమారుడికి అమ్మ ఒడి వస్తుందని.. కొడుకు తాగితేనే తల్లికి ఫించన్ వచ్చేలా మద్యం పాలసీ తెచ్చారని మండిపడ్డారు. ఓటు అనే ఆయుధంతోనే జగన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.