తెలంగాణ

telangana

ETV Bharat / city

TDP leaders serious: 'వైకాపా దోపిడీని అడ్డుకుంటే.. దాడులు చేస్తారా?'

ఏపీలోని కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీసులు.. తెదేపా నేతలను మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగిన ఆ రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమను... అర్ధరాత్రి తర్వాత పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు ఏపీ మాజీ మంత్రి పట్టాభి, ఎమ్మెల్యే బోడె ప్రసాద్​లను అరెస్టు చేశారు. తెదేపా నేతల అరెస్ట్​లను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఆ పార్టీ మాజీమంత్రులు యనమల, నిమ్మకాయల చినరాజప్ప ఖండించారు. ప్రజా సంపదను వైకాపా నేతలు దోచుకుంటుంటే అడ్డుకోవడం తప్పా అని వారు నిలదీశారు.

tdp on ycp, Tdp leaders serious
తెదేపా ఆగ్రహం, వైకాపాపై తెదేపా ఫైర్

By

Published : Jul 28, 2021, 1:59 PM IST

Updated : Jul 28, 2021, 3:44 PM IST

ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి దేవినేని అరెస్ట్​ను తెదేపా నేతలు ఖండించారు. ప్రజా సంపదను వైకాపా నేతలు దోచుకుంటుంటే అడ్డుకోవడం తప్పా అని నిలదీశారు. దేవినేనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల్ని నిందితుల్ని చేసిన దుర్మార్గమైన పోలీసు వ్యవ‌స్థ ఏపీలో ఉండ‌టం దుర‌దృష్టక‌రమని లోకేశ్ విమర్శించారు.

'మీ బాస్‌కి ప‌ట్టిన గ‌తే మీకూ పడుతుంది'

వైకాపా మైనింగ్ మాఫియా, అవినీతి, అక్రమాలకు అడుగ‌డుగునా అడ్డుప‌డుతున్నార‌నే ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమాపై రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. దేవినేనిపై దాడిచేసిన నిందితుల‌పై ఐపీసీ సెక్షన్లు కింద కేసులుపెట్టి, అరెస్ట్ చేయాల్సిన పోలీసులు.. తిరిగి ఉమా పైనే వైకాపా సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బాధితుల్ని నిందితుల్ని చేసిన దుర్మార్గమైన పోలీసు వ్యవ‌స్థ ఏపీలో ఉండ‌టం దుర‌దృష్టక‌రమన్నారు. మాజీ మంత్రినే చ‌ట్టవ్యతిరేకంగా ఇంత‌గా హింసిస్తుంటే.. సామాన్యుల ప‌రిస్థితి ఇంకెంత ద‌య‌నీయంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చని ఆక్షేపించారు. చ‌ట్టాన్ని చుట్టం చేసుకున్న పోలీసులకు.. తాడేప‌ల్లి కొంప క‌నుసైగ‌లే చ‌ట్టంగా నిర్ణయాలు తీసుకుంటున్న మీ బాస్‌కి ప‌ట్టిన గ‌తే మీకూ పడుతుందని హెచ్చరించారు. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అన్యాయంగా వ్యవ‌హ‌రిస్తున్నా.. న్యాయం ముందు దోషులుగా నిల‌బ‌డ‌క త‌ప్పదన్నారు.

'అవినీతి రాజ్యమేలుతోంది'

వైకాపా పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని.. ఏపీ మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. సహజ వనరుల దోపిడీని అడ్డుకుంటే దాడులు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

నిందితులను వదిలేసి బాధితులను అరెస్టు చేయడం ఏంటి. వసంత కృష్ణప్రసాద్‌ కనుసన్నల్లోనే గ్రావెల్‌ను దోచుకు తింటున్నారు. పోలీసు వ్యవస్థ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమాను వెంటనే వదిలిపెట్టి నిందితులను అరెస్టు చేయాలి. వైకాపా నేతల సహజవరుల దోపిడీపై తెదేపా పోరాటం ఆగదు.

-యనమల రామకృష్ణుడు, ఏపీ మాజీ మంత్రి

ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా ఖూనీ చేస్తున్నారు:

బెయిల్​కు అనుకూలంగా లేని సెక్షన్లు దేవినేని ఉమాపై పెట్టడం సిగ్గు చేటు. పోలీసులు పూర్తిపక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. వైకాపా నేతలు చెప్పిందల్లా చేయటానికేనా పోలీసులుంది?. ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా ఖూనీ చేసి... ఉమాతో పాటు 18మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దేవినేని ఉమా ఫిర్యాదు తీసుకోకుండా తప్పుడు కేసు ఆయనపైనే పెట్టించటం దుర్మార్గం. ఉమాను లక్ష్యంగా చేసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం జైలుకు పంపాలనే తమ కలను నెరవేర్చుకుంటుంది.

-నక్కా ఆనంద్ బాబు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు

'వైకాపా ఆగడాలు మితిమీరిపోతున్నాయి..'

దేవినేని ఉమాపై దాడిని ఖండించిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి... వైకాపా నేతల అరాచకాలు, ఆగడాలు మితిమీరిపోతున్నాయి మండిపడ్డారు. అక్రమాల పరిశీలనకు వెళ్తే దాడికి పాల్పడటం దుర్మార్గమని అన్నారు. ఏపీ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

దాడి.. పిరికిపింద చర్య..

దేవినేని ఉమామహేశ్వరరావుపై దాడి అమానుషమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. వైకాపా గూండా రాజకీయాలు చేస్తోందన్నారు. ఒక్కరిపై 100 మంది వైకాపా గూండాల దాడి పిరికిపింద చర్య అని వ్యాఖ్యానించారు. కొండపల్లి ఫారెస్టులో... స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రోద్బలంతోనే దేవినేని ఉమాపై దాడి జరిగిందని ఆరోపించారు. వైకాపా కార్యకర్తలను అడ్డుకోవాల్సి వస్తుందన్న భయంతో.. దాడి జరుగుతున్నా పోలీసులు ఘటనా స్థలానికి రాలేదన్నారు. అవినీతి, అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడతారా అని ప్రశ్నించారు. ప్రజా సంపదను వైకాపా నేతలు దోచుకుంటుంటే ప్రజల తరపున తెలుగుదేశం నేతలు అడ్డుకోవడం తప్పా అని నిలదీశారు. ఏపీలో మాజీ మంత్రికే రక్షణ లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్నారు. మైనింగ్‌ను అడ్డుకుంటే హత్యాయత్నాలు, బెదిరింపులకు పాల్పడుతారా అని ధ్వజమెత్తారు.

' అక్రమ దందాలను ఎండగడతాం'

“వైకాపా దొంగలు రాష్ట్రాన్ని బందిపోటు దొంగలకు మించిన స్థాయిలో దోచుకుంటున్నారు. అక్రమ మైనింగ్ దందాను బట్టబయలు చేసిన దేవినేని ఉమాపై వైకాపా నేతల దాదాగిరిని ఖండిస్తున్నానని.. తన దోపిడీ బయటకు రావటంతోనే కిరాయి గూండాలను పోగేసుకుని ఏపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. వైకాపా నేతలు దేవినేని ఉమాపై చేసిన హత్యాయత్నాన్ని డీజీపీ భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా ప్రశ్నించారు. ప్రజా కోర్టులో వైకాపా అవినీతి, అక్రమ దందాలను ఎండగడతాం.“ కళా వెంకట్రావు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు

'పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయేలా...'

అక్రమ మైనింగ్‌పై ప్రశ్నించిన దేవినేనిపై దాడి హేయమైన చర్య. అక్రమాలపై ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాస్తోంది. ఆరోపించారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేకుండా చేస్తున్నారని.. ప్రతిపక్షాలను సీఎం అణచివేస్తున్నారని మండిపడ్డారు.

'ప్రతి పోలీస్​కు శిక్షతప్పదు..'

అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన వ్యక్తిపై ఎస్సీఎస్టీ కేసు ఎలా పెట్టారని ఏపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు నిలదీశారు. వైకాపా గూండాల దాడికి పోలీసులు దగ్గరుండి సహకరించారని ఆరోపించారు. దేవినేని ఉమాని ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రిని గద్దె దింపే వరకు ప్రతి తెదేపా కార్యకర్త ఎన్నాళ్లు జైళ్లల్లో ఉండటానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. 2024 లో తెదేపా ప్రభుత్వం వచ్చిన మరుక్షణం వైకాపా ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్న ప్రతి పోలీస్​కు శిక్షతప్పదని హెచ్చరించారు. చట్టపరంగా పోలీసులను ఎలా శిక్షించాలో తమకు బాగా తెలుసన్నారు.

బేషరతుగా ఉపసంహరించుకోవాలి: వంగలపూడి అనిత

వైకాపా ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నిస్తే హత్యాయత్నం కేసులు పెడుతున్నారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఎప్పుడో చచ్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అండతోనే వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి తెదేపా నాయకులపై అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: బుద్ధా వెంకన్న

ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా అక్రమ అరెస్టును మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఖండించారు. గత రెండు సంవత్సరాలుగా తెదేపా నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తెదేపా హయాంలో ఒక్క వైకాపా కార్యకర్త మీద కూడా దాడులు జరగలేదని తెలిపారు. దేవినేని ఉమాపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వెంటనే ఆయనకు ఏపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ధ్వజమెత్తారు.

తెదేపా శ్రేణుల ఆందోళన

ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా అక్రమ అరెస్టును ఖండిస్తూ కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నారు. దేవినేని ఉమాను విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. తమకు దేవినేనిని చూపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో నందివాడ పోలీస్ స్టేషన్ వద్ద భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తూ తెదేపా నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. తిరువూరు ఇంఛార్జ్ శావల దేవదత్‌ను పోలీసులు గృహనిర్భందం చేశారు. పోలీసులు అడ్డుకొవడంతో వారితో తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు వ్వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటారా అని నిలదీశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి సేష్టన్​కు తరలించారు.

చందర్లపాడు మండలంలో దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేవినేని ఉమాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 28, 2021, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details