తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు మళ్లీ అరెస్టు చేస్తారనే ఉద్దేశంతోనే పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రిని దూషించారనే ఆరోపణలతో బుధవారం( అక్టోబర్ 20) అరెస్టైన పట్టాభి.. శనివారం (అక్టోబర్ 23) సాయంత్రం రాజమహేంద్రవరం కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అక్కడి నుంచి విజయవాడ వస్తుండగా పొట్టిపాడు టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న వాహనాలను నిలిపేశారు. ఆ తర్వాత పట్టాభిరామ్ ఎవరికీ కనిపించలేదు.
పట్టాభి వ్యాఖ్యలపై.
ఈనెల 19న తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి నిర్వహించిన మీడియా సమావేశం(pattabhi press meet)లో ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు(nakka anand babu)కు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, ఏపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన వాడిన భాషను వ్యతిరేకిస్తూ కొందరు దుండగులు పలు ప్రాంతాల్లో దాడి చేశారు. విజయవాడలో ఉన్న పట్టాభి నివాసంలోనూ కొందరు వైకాపా శ్రేణులు దాడి చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది.
అరెస్టు ఇలా..
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను గత బుధవారం రాత్రి విజయవాడ పటమటలోని ఆయన ఇంటివద్ద పోలీసులు హైడ్రామా నడుమ అరెస్టు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిపై పట్టాభి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచీ ఆయన ఇంటివద్ద పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. అరెస్టు చేస్తారనే వార్తలు రావడంతో పట్టాభి బయటకు రాకుండా తన ఇంట్లోనే ఉండిపోయారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు మీడియా, పార్టీ శ్రేణులు ఇంటి వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాము అరెస్టు చేయడానికి రాలేదని, మంగళవారం జరిగిన దాడిపై స్టేట్‌మెంట్ నమోదు చేసేందుకు వచ్చామని పోలీసులు తొలుత చెప్పారు. రాత్రి 8.30 సమయంలో పోలీసుల హడావుడి పెరిగింది. అదనపు బలగాలను దింపారు. రోప్ పార్టీ వచ్చి.. మీడియా, నాయకులను దూరంగా తీసుకెళ్లారు. 9 గంటలకు పోలీసులు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ముందుగా ఇంటి ప్రధానద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నం చేశారు. సెంట్రల్‌లాక్ కావడంతో తెరుచుకోలేదు. ఇంటి వెనక్కి వెళ్లి వంటగది తలుపులు పగలగొట్టి 30మందికి పైగా పోలీసులు లోపలికి ప్రవేశించారు. పట్టాభిని అరెస్టు చేసి.. ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు. తెదేపా నేతలు, కుటుంబసభ్యులు అడ్డుకున్నా.. వారిని పక్కకు నెట్టి పట్టాభిని వాహనంలో ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఈ సంఘటనను కవర్ చేయకుండా మీడియాను దూరంగా పంపించారు. పట్టాభిని అరెస్టుచేసి రాత్రి 10 గంటలకు తోట్లవల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు.
ఇదీచూడండి:TDP leaders: ఏపీలో రాష్ట్రపతి పాలన.. సానుకూలంగా స్పందించిన కోవింద్..!