తెలంగాణ

telangana

ETV Bharat / city

PATTABHI BAIL: ఏపీ హైకోర్టులో పట్టాభి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు - తెలంగాణ వార్తలు

ఏపీ సీఎం జగన్‌ను పరుష పదజాలంతో దూషించారన్న కారణంగా అరెస్టయిన తెదేపా నేత పట్టాభిరామ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై రేపు విచారించనున్నట్లు ఆ రాష్ట్ర హైకోర్టు తెలిపింది.

pattabhi bail petition, ap politics news
ఏపీ హైకోర్టులో పట్టాభి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు, ఏపీ పాలిటిక్స్ వార్తలు

By

Published : Oct 22, 2021, 3:45 PM IST

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెదేపా నేత పట్టాభిరామ్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్​ను అత్యవసరంగా విచారించాలని పట్టాభి తరపు న్యాయవాది కోరారు. ఈ అంశంపై రేపు విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.

అసలేమైంది..?

తెదేపా నేత పట్టాభిరామ్‌కు మేజిస్ట్రేట్‌ వచ్చే నెల 2వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. ఏపీ సీఎం జగన్‌ను పరుష పదజాలంతో దూషించి, గొడవలకు కారకుడయ్యారని విజయవాడకు చెందిన వ్యాపారి షేక్‌ మస్తాన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదుచేసి పట్టాభిని అరెస్టు చేశారు. గురువారం ఉదయం విజయవాడ కొత్త ఆసుపత్రికి తీసుకొచ్చి, కొవిడ్‌ సహా పలు పరీక్షలు చేయించారు. అనంతరం మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. పట్టాభిపై ఐదు కేసులున్నాయని, ముఖ్యమంత్రిని దూషించారని, ఆయన తల్లిని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని, అందువల్ల రిమాండ్‌ విధించాలని కోరారు.

పట్టాభి తరఫు న్యాయవాదులు గూడపాటి లక్ష్మీనారాయణ, చేకూరి శ్రీపతిరావు వాదనలు వినిపిస్తూ.. 41 (ఏ) సీఆర్‌పీసీ ప్రకారం స్టేషన్‌ బెయిలు ఇవ్వాలన్నారు. వాదనలు విన్న మేజిస్ట్రేట్‌ శ్రీసత్యాదేవి.. నిందితుడికి వచ్చేనెల 2వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ కోసం నిందితుడిని ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం కొవిడ్‌ ఫలితం వచ్చేవరకూ మచిలీపట్నంలోని జిల్లాజైలులో ఉంచారు. శుక్రవారం ఉదయం మచిలీపట్నం నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పట్టాభిని తరలించారు.

ఇదీ చూడండి:paritala sunitha Comments : మాకూ బీపీ వస్తోంది.. ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం: పరిటాల సునీత

ABOUT THE AUTHOR

...view details