Dhulipalla Narendra Deeksha at Suddapalli:భారీ యంత్రాలతో రేయింబవళ్లు తవ్వకాలు...! వందల అడుగుల లోతు వరకు భూగర్భాన్ని తొలిచి అక్రమంగా మట్టి తరలింపు...! గతంలో తవ్వకాలు జరిపిన ప్రాంతంలోనే మరింత లోతుగా మట్టి తవ్వకాలు...! చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారగణం...! ఇదీ ఏపీలోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో మట్టి అక్రమ తవ్వకాలు సాగుతున్న తీరు. దాదాపు వంద అడుగుల లోతు వరకు తవ్వి మట్టిని తరలించేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ.. తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర నేరుగా రంగంలోకి దిగారు.
బుధవారం క్వారీ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన... అక్కడే భైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకునే వరకు విరమించేది లేదని తేల్చిచెప్పారు. రాత్రి గనులశాఖ అధికారులు వచ్చి చర్చించినా నరేంద్ర పట్టు విడవలేదు. స్వయంగా గనులశాఖ ఏడీ వచ్చి పరిశీలించి, తగిన చర్యలు చేపడతామని భరోసా ఇచ్చాకే ఆందోళన విరమిస్తానని స్పష్టం చేశారు. రాత్రంతా చలిలోనే దీక్షా శిబిరంలో నిద్రించారు.