Chandrababu Fires on YSRCP: నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని.. ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండగ జరుపుకోలేని పరిస్థితి ఏపీలో నెలకొందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా పాలనలో బెదిరింపులు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగువాళ్లు తలదించుకునేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో 175 శాసనసభ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఇంఛార్జిలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనపై విమర్శలు చేశారు.
'అప్పుడు రద్దు అన్నారు.. ఇప్పుడు కావాలంటున్నారు..'
మెజార్టీ లేదని శాసనమండలి రద్దు చేస్తామని.. మెజార్టీ రాగానే రద్దును పక్కన పెట్టేశారని.. వైకాపా ప్రభుత్వంపై బాబు ధ్వజమెత్తారు. మండలి విషయంలో ఇలాంటి తీరు సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. గతంలో జగన్‌కు సహకరించిన అధికారులు జైళ్లకు వెళ్లారని గుర్తుచేశారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని.. మద్యం వినియోగం పెంచుతూనే మద్యనిషేధం అని చెబుతున్నారని మండిపడ్డారు. ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు ఓటీఎస్ అంటున్నారని ధ్వజమెత్తారు.
'మూడేళ్లల్లో.. మూడు ఇళ్లు కూడా కట్టలేదు'
మూడేళ్లల్లో జగన్ ప్రభుత్వం మూడు ఇళ్లు కూడా కట్టలేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆస్పత్రుల్లో మందులు కూడా కరవయ్యాయని ధ్వజమెత్తారు. 1000 రూపాయలు దాటితే.. ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పారన్న బాబు.. దాని ఊసే ఎత్తడం లేదన్నారు. ఏపీలోని మరమ్మతులకు గురై ప్రజలు, ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నారని, అయినా.. ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులను డోలీల్లో తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు.
'శ్వేత పత్రం విడుదల చేయాలి..'
విద్యుత్ ఛార్జీలు పెంచారని.. రేపో మాపో మళ్లీ పెంచబోతున్నారని చంద్రబాబు చెప్పారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పన్నులు పెంచి సొంత ఖజానాను నింపుకుంటున్నారని ఆరోపించారు. ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయం ఏమైందని నిలదీశారు. ధైర్యముంటే సాధించాలి.. లేకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. దిల్లీ వెళ్లి ఏంసాధించారో సీఎం జగన్ జవాబు చెప్పాలని నిలదీశారు.
'సీపీఎస్‌పై అప్పుడో మాట.. ఇప్పుడో మాట'
సీపీఎస్ విషయం నాకు వదిలిపెట్టండి.. నేను చూసుకుంటానన్న జగన్.. ఇప్పుడు బడ్జెట్ కూడా సరిపోదంటున్నారని ఎద్దేవా చేశారు. కోడికత్తి కేసు ఏమైందన్న చంద్రబాబు.. చిన్నాన్న చనిపోతే అందర్నీ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం... రైతులు, రైతు కూలీలను మోసం చేసిందని.. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించకుండా ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు.
'ఆనాటి గ్రాఫిక్సే.. నేటి ఎనిమిది లైన్ల రహదారి'
ఏపీకి పట్టుకున్న వైకాపా వైరస్‌కు తెలుగుదేశం పార్టీనే సరైన వ్యాక్సిన్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బీసీల అభ్యున్నతే తమ లక్ష్యమన్నారు. మైనార్టీలు, మదర్సాలపై దాడిచేస్తున్నారని మండిపడ్డారు. వైకాపాకు ఓట్లేయడమే మైనార్టీలు చేసిన తప్పా... అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. తెదేపా లేకుండా చేయడం వైకాపా వల్ల కాదన్నారు. ఆనాడు హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు కూడా గ్రాఫిక్సే అన్నారని.. ఆనాటి గ్రాఫిక్సే ఇప్పటి 8 లైన్ల రహదారని స్పష్టం చేశారు. సంపద సృష్టించే ఆలోచన జగన్ రెడ్డికి లేదు కాబట్టే.. రూ.2లక్షల కోట్లు ఆస్తి అయిన అమరావతిని నాశనం చేశారని ధ్వజమెత్తారు. 5 కోట్ల మంది ప్రజల కోసం తాము చేసేది ధర్మపోరాటమని చంద్రబాబు తేల్చి చెప్పారు.
ఇదీచూడండి:జగన్ చేసిన తప్పులను.. చరిత్ర మరచిపోదు: చంద్రబాబు