ఏపీలోని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో(Protest in narsipatnam) ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీలో వైకాపా సభ్యుల అనుచిత ప్రవర్తనకు నిరసనగా తెదేపా నేతలు చేపట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పార్టీ నేత అయ్యన్నపాత్రుడు సహా.. నాయకులు, కార్యకర్తలు నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులతో అయ్యన్నపాత్రుడు(ayyanna patrudu dharna on road) వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో అయ్యన్నపాత్రుడి చేతికి గాయమైంది. ఎవరు అడ్డుకున్నా ర్యాలీ ఆగదన్న అయ్యన్న.. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా అధినేత చంద్రబాబునాయుడి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. విశాఖ జిల్లా నర్సీపట్నంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అయ్యన్నపాత్రుడి నివాసం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆందోళనలు(TDP leaders protest in NTR stadium Narsipatnam) చేసేందుకు సమాయత్తమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నేతలు తరలివచ్చారు. ఈ క్రమంలో ర్యాలీకి అనుమతి లేదంటూ నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా.. తెదేపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ పరిణామాల నడుమ వినతిపత్రం ఇచ్చేందుకు మహిళలను పోలీసులు అనుమతించారు.