తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రచారంలో రాళ్ల దాడి - రాళ్ల దాడిపై మండిపడిన చంద్రబాబు

తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో అలజడి రేగింది. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వాహనంపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనను నిరసిస్తూ తెదేపా అధినేత రోడ్డుపై బైఠాయించడం, అనంతరం ఎస్పీ కార్యాలయం వరకూ చేసిన ర్యాలీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబుకే రక్షణ లేని పరిస్థితుల్లో... కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉపఎన్నికలు నిర్వహించాలని తెదేపా డిమాండ్‌ చేసింది.

stone attack in chandrababu tirupati campaign
చంద్రబాబు ప్రచారంలో రాళ్ల దాడి

By

Published : Apr 13, 2021, 8:06 AM IST

చంద్రబాబు ప్రచారంలో రాళ్ల దాడి

తిరుపతిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రచారం సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం రైల్వేస్టేషన్ నుంచి కర్ణాల వీధి, భేరి వీధి మీదుగా కృష్ణాపురం ఠాణా వరకూ చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. రాత్రి 7 గంటల 45 నిమిషాల సమయంలో ప్రచార రథంపై నుంచి చంద్రబాబు ప్రసంగిస్తుండగా... ఒకదాని వెంట ఒకటి మూడు రాళ్లు దూసుకొచ్చాయి. రాళ్లు తగిలి ఓ మహిళ, మరో కార్యకర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రసంగాన్ని నిలిపేసిన చంద్రబాబు... ఆకతాయి చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న తనకే భద్రత లేకుంటే... సామాన్యుల పరిస్థితి ఏంటంటూ పోలీసులను నిలదీశారు.

'పోలీసులు స్పందించరా..?'

రాళ్ల దాడిపై పోలీసులు స్పందించకపోవడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు... ప్రచార రథం దిగి రోడ్డుపై బైఠాయించారు. ఈలోపు అక్కడికి చేరుకున్న తిరుపతి అర్బన్ క్రైం అదనపు ఎస్పీ మునిరామయ్య.. శాంతించాలని చంద్రబాబును కోరారు. నిందితులను కనిపెట్టి చర్యలు తీసుకుంటామన్న ఆయన... శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాళ్ల దాడి ఘటనపై తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు.

ఘటనపై నిరసనగా ర్యాలీ...

ఘటనపై తిరుపతి అర్బన్ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు... నాయకులు, కార్యకర్తలతో సహా చంద్రబాబు ర్యాలీగా తరలివెళ్లారు. అక్కడ ఎస్పీ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈలోగా కార్యాలయానికి చేరుకున్న అదనపు ఎస్పీ సుప్రజ.... ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తామని చెప్పారు. ప్రచార రథంపై రాళ్లదాడి పోలీసు వైఫల్యమేనన్న ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్... సుమోటోగా కేసు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించిన ఏఎస్పీ... పూర్తిస్థాయి విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. అర్బన్ ఏఎస్పీ హామీతో ఆందోళన విరమించిన చంద్రబాబు.... కపిలతీర్థంలోని పార్టీ కార్యాలయానికి చేరుకొని రాత్రి అక్కడే బస చేశారు.

బాధితులకు పరామర్శ

ఈ దాడిలో ఓ మహిళతో పాటు యువకుడు గాయపడ్డాడు. బాధితులను పిలిపించుకుని వారితో చంద్రబాబు మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దాడికి దిగుతున్నారన్న బాబు.. రౌడీయిజానికి భయపడేది లేదని తేల్చిచెప్పారు. చిత్తూరులోనే పుట్టి పెరిగిన తనపై దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని జగన్‌కు సూచిస్తున్నానన్నారు. తాను నిలదీసిన తర్వాతే ఏపీలోని ఆలయాలపై దాడులు తగ్గాయన్నారు.

'మాపై జరిగిన రాళ్లదాడి రాజకీయ కుట్ర. తెదేపా నేతలపై కుట్రపూరితంగా దాడి చేశారు. తెదేపాను లేకుండా చేయాలని వైకాపా కుట్ర చేస్తోంది. రాళ్లదాడి ఘటనపై.. మా ఎంపీలు దిల్లీకి వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేస్తారు. ప్రభుత్వ సిబ్బంది నిష్పక్షపాతంగా పని చేయాలి. పోలీసులు సీఈసీ పరిధిలో విధులు నిర్వహించాలి. కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరుపతి ఉపఎన్నికలు జరగాలి. రాళ్లదాడి చేస్తే భయపడేది లేదు. ఖబడ్దార్‌. జాగ్రత్తగా ఉండండి. గతంలో మీ రౌడీయిజాన్ని అణచివేశా. పోలీసులూ చూడండి. సభలో రాళ్లు వేస్తున్నారు. శాంతిభద్రతల రక్షణ మీకు చేతకాకుంటే 5 నిమిషాల్లో చేసి చూపిస్తా. జడ్‌ప్లస్‌ భద్రత కలిగిన నాకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది? 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఎప్పుడూ నా సభలో రాయి వేసే సాహసం ఎవరూ చేయలేదు. ఎవరినీ వదలిపెట్టను. అవసరమైతే ప్రజల కోసం పోరాడి జైలుకెళ్తా. రాళ్లు వేసిన వాళ్లను పట్టుకోవాలి. ఇంత పెద్ద సభలో పోలీసులు లేరు. వారు వెంటనే ముందుకు రాకుంటే ఇక్కడే ధర్నా చేస్తా.

- చంద్రబాబు

ఏపీ గవర్నర్​కు ఫిర్యాదు

తిరుపతిలో చంద్రబాబు వాహనంపైకి రాళ్లు విసిరిన ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని తెదేపా నిర్ణయించింది. గవర్నర్​ను కలిసేందుకు ఆ పార్టీ నేతలు సమయం కోరారు. చంద్రబాబుపై దాడి వైకాపా రౌడీ మూకల పనేనని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ ఘటనకు ఏపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. తిరుప‌తి కొండ‌పై స్మగ్లర్లు, తీవ్రవాదుల‌ు కుమ్మక్కై 24 క్లైమోర్‌మైన్లు పేల్చితే.. సాక్షాత్తు ఏడుకొండ‌ల‌ వాడే కాపాడిన ప్రాణం చంద్రబాబుదని నారా లోకేశ్‌ అన్నారు. సీఎం జగన్‌ రాళ్లు వేయిస్తే, అదే రాళ్లతో జ‌నానికి ప‌నికొచ్చే నిర్మాణం చేయగ‌ల విజ‌న‌రీ చంద్రబాబుదనని స్పష్టం చేశారు. ప్రశ్నించే ప్రజా గొంతున సీఎం జగన్ నులిమే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా నేతలు యనమల, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. గతంలోనూ చంద్రబాబు అమరావతి పర్యటనలో ఇలానే దాడి చేయించారన్నారు. ఎమ్మెల్సీలు మంతెన సత్యనారాయణరాజు, అశోక్ బాబు, తెదేపా నేత మద్దిపట్ల సూర్యప్రకాశ్ ఘటనను ఖండించారు.

'సీఎం జగన్​ ప్రోద్బలంతోనే మాపై రాళ్ల దాడి'

ఏపీ సీఎం జగన్ ప్రోద్బలంతోనే రాళ్లదాడి జరిగిందని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తెదేపా సభలో రాళ్ల దాడిని ఆయన ఖండించారు. పోలీసులే దగ్గరుండి రాళ్ల దాడి చేయించారని ఆరోపించారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరుపతి ఉపఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు. ఈసీ పరిధిలో జరిగే ఎన్నికల్లో ఇలాంటి ఘటన దారుణమన్నారు.

'పవన్‌పై కక్షసాధిస్తున్నారు'

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భాజపాకు మద్దతిస్తున్నారని ఆయనపై ఏపీ ప్రభుత్వం కక్షసాధిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘ఆయన వకీల్‌సాబ్‌ సినిమా తీస్తే ఈయనకు ఎందుకు బాధ వచ్చిందో అర్థం కావట్లేదు. అందరికీ ఐదారు రోజులు టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తుంటారు. పవన్‌ సినిమాకు మాత్రం అవకాశం కల్పించలేదు. ఈ మాట అంటే నేను పవన్‌కు మద్దతిస్తున్నట్లు కాదు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు అందరికీ సమానంగా అందాలి. సినిమా పరిశ్రమపై అనేక మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఎవరికి అన్యాయం జరిగినా తెదేపా పోరాడుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు.

ఇవీచూడండి:ప్రారంభాలు, పార్టీలకు చురకలతో సాగిన కేటీఆర్​ ఓరుగల్లు పర్యటన

ABOUT THE AUTHOR

...view details