ఏపీలోని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తన భర్తకు ప్రాణాపాయం ఉందని, ఆయనకు తగిన భద్రత కల్పించి మైనింగ్ మాఫియా నుంచి రక్షించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భార్య దేవినేని అనుపమ.. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హోంమంత్రి మేకతోటి సుచరితలను కోరారు. రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ను అకస్మాత్తుగా బదిలీ చేయడంతో తన భర్త భద్రతపై తీవ్ర సందేహాలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారందరికీ రాసిన లేఖను శనివారం విడుదల చేశారు.
‘దేవినేని ఉమామహేశ్వరరావు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో చురుగ్గా పాల్గొంటారు. అవినీతి, మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతారు. ఫలితంగా మైనింగ్ మాఫియాకు చెందిన గూండాలు ఉమాను, ఆయన కుటుంబసభ్యులను, ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జులై 27న జి.కొండూరు మండలంలో ఆయనపై దాడి జరిగింది. అనంతరం తప్పుడు కేసుల్లో అరెస్టుచేసి రాజమహేంద్రవరం జైలుకు పంపారు. గతంలో జైళ్లలో హత్యలు, వేధింపులు చోటుచేసుకున్నందున రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉమాకు ప్రాణహాని ఉందని ఆయన కుటుంబసభ్యులు, మద్దతుదారులు, అనుచరులు, అభిమానులు భయపడుతున్నారు’ అని లేఖలో అనుపమ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ రాజారావు బదిలీ ఉత్తర్వుల్ని లేఖకు జత చేస్తున్నట్లు పేర్కొన్నారు.