రైతు ప్రయోజన విధానాలతోనే అన్నదాతల్లో విశ్వాసాన్ని ఇనుమడింపజేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. 22 మంది ఎంపీలు ఉండి... లోక్ సభలో వైకాపా నోరు తెరవకపోవడం రైతు ద్రోహమే అని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు మద్దతు ధరతో పాటు.. అదనంగా బోనస్ చెల్లించి కొనుగోళ్లు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం వైకాపా పాలనలో రైతులకు బోనస్ లేకపోగా మద్దతు ధరే లభించక రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి నెలకొందని చెప్పారు.
సమగ్ర చర్చ జరగాలి
రైతుల లాభాలు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాలని, జాతీయ స్థాయిలో వ్యవసాయ బిల్లులపై సమగ్ర చర్చ జరగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రైతులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం సాధించాలని చెప్పారు. రైతు ప్రయోజనాలే మిన్నగా పాలకుల నిర్ణయాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ బిల్లులపై రైతుల్లో, రైతు సంఘాల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో సమగ్ర చర్చ జరపి, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సగటు భారతీయ రైతు అక్షరాస్యత, అవగాహనలతో పాటు, స్థానిక రైతు నిస్సహాయతను కూడా పరిగణించి చట్టాలను రూపొందించాలన్నారు.