అమరావతి విషయంలో.. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించిన బహిరంగ సభకు చంద్రబాబు సహా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఐకాస నేతలు హాజరయ్యారు. తెదేపా ప్రభుత్వం ఉన్నప్పుడు.. జగన్ ఎక్కడికి వెళ్లినా అడ్డుకోలేదని చంద్రబాబు చెప్పారు. ఇలా అడ్డుకుంటే జగన్ రాష్ట్రంలో తిరిగేవారా? అని ప్రశ్నించారు. నాయకులు ప్రతిమాటా జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. గుంటూరు జిల్లా వైకాపా నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు సైతం అమరావతి ఉద్యమం చేస్తున్నారని గుర్తు చేసిన చంద్రబాబు.. ఇప్పటివరకు 37 మంది రైతులు చనిపోయారని.. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని స్పష్టం చేశారు.
''వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజు త్వరలోనే వస్తుంది. వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారు. తెనాలిలో చిల్లర రౌడీలు రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేశారు? ఆఖరికి ధర్నా శిబిరం తగలబెడతారా? విధ్వంసం, కక్షకు కూడా హద్దులు ఉంటాయి. సీఎం జగన్ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ప్రజావేదిక కూల్చారు.. అది ఎవరి ఆస్తి..? పోరాటంలో ఎప్పుడూ ధర్మం, న్యాయమే గెలిచింది. నేను ఒక్క పిలుపు ఇస్తే రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా అమరావతికి సిఫారసు చేసింది. అమరావతిని మార్చే అధికారం మీకు లేదు. ఉన్న రాజధానిని గతంలో ఎప్పుడూ మార్చలేదు'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.