CBN ON NTR HEALTH UNIVERSITY: తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన నందమూరి తారకరాముడి పేరు ఆరోగ్య వర్సిటీ నుంచి తొలగించి సీఎం జగన్ పెద్ద తప్పు చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జగన్ మాదిరిగా తాను ఆలోచించి ఉంటే.. కడప జిల్లాకు వైఎస్సార్ పేరు ఉండేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ నీచ సంస్కృతికి తెరలేపారన్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ ఎన్టీఆర్ పేరు పునరుద్ధరిస్తామని తేల్చి చెప్పారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెదేపా బీసీ సాధికారక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
"హెల్త్ యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెట్టేవరకు ఊరుకునేది లేదు. పేరు మార్చి జగన్ తన నీచ బుద్దిని బయటపెట్టుకున్నారు. నేను తలుచుకుంటే కడపకు వైఎస్సార్ పేరు ఉండేదా..? పేర్లు మార్చడం నాకు చేతకాదా..? కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టి.. వైఎస్సార్ పేరు పెట్టుకోవచ్చు.. ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి.. వైఎస్సార్ పేరు పెట్టుకో..": - చంద్రబాబు
బీసీలకు అండగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ : బలహీనవర్గాల వారి వల్లే తెదేపా బలంగా ఉందని తెలిపారు. బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. గతంలోని నేతలు బీసీలను కేవలం ఓటుబ్యాంకుగా చూశారని.. కానీ ఎన్టీఆర్ అనేకమంది బీసీలకు కీలక పదవులు ఇచ్చారని వెల్లడించారు. బీసీల నాయకత్వాన్ని పెంచింది తెదేపా మాత్రమే అని.. అందుకోసం ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకువచ్చారన్నారు.