తెలంగాణ

telangana

ETV Bharat / city

Chandrababu: 'ధైర్యం ఉంటే.. జగన్ ఆ పని చేయగలరా ?' - చంద్రబాబు లేటెస్ట్ న్యూస్

సినీ పరిశ్రమలో సమస్య సృష్టించి, మళ్లీ తానే పరిష్కరిస్తున్నట్లు వ్యవహరిస్తున్న సీఎం జగన్ తీరు ఊహకందనిదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అనేక అబద్ధాలు చెప్పిన జగన్.. అసమర్థుడనని అంగీకరించి, సీఎంగా తప్పుకుంటే ఏపీకి పట్టిన శని వదిలిపోతుందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులకు ఎవరేం చేశారో తేల్చేందుకు ధైర్యం ఉంటే చర్చకు రావాలని జగన్​కు సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం 9 బడ్జెట్లు ప్రవేశపెట్టాక కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక హోదా, విభజన హామీలు, హక్కులను సాధించలేకపోయిందని విమర్శించారు. ధైర్యం ఉంటే ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

chandrababu on jagan
chandrababu naidu

By

Published : Feb 11, 2022, 8:33 PM IST

ఏపీ ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా జగన్ మోసగించిన తీరు ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రజలను కోరారు. తాజా రాజకీయ పరిణామాలపై మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. సినీ పరిశ్రమపై సీఎం జగన్ కక్షకట్టి బ్లాక్​మెయిల్ చేస్తున్నారన్నది.. నిన్నటి సినీ పెద్దల మాటలతో స్పష్టమైందన్నారు. వివిధ వర్గాల పొట్టకొట్టిన జగన్.. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా చేశారని ధ్వజమెత్తారు. బరితెగించిన వైకాపా నేరగాళ్లు.. ఉగ్రవాదులను మించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నేరగాళ్లు రాజ్యమేలితే ఇలానే ఉంటుందన్న చంద్రబాబు.. 2019 వరకు తమ జీవన ప్రమాణాలేంటి ?.. ప్రస్తుతమేంటనేది ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు.

అశోక్ బాబు చేసిన తప్పేంటి..?
ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టు.. క్విడ్ ప్రోకోలో భాగమేనని చంద్రబాబు ఆరోపించారు. అశోక్​బాబుపై ఫిర్యాదుచేసిన మెహర్​కుమార్ సోదరుడి భార్యకు బ్రాహ్మణ కార్పొరేషన్​లో నామినేటెడ్ పదవి కట్టబెట్టారంటూ సంబంధిత వివరాలను చంద్రబాబు బయటపెట్టారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న వారి పక్షాన నిలవటమే అశోక్​బాబు చేసిన తప్పా?... అని చంద్రబాబు నిలదీశారు. ఎమ్మెల్సీ నామినేషన్​లోనూ అశోక్​బాబు తన విద్యార్హత ఇంటర్మీడియట్ అనే పేర్కొన్నారన్నారు. టైపింగ్ పొరపాటు వల్ల జరిగిన అంశంపై ఇంతలా కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు. అంగన్​వాడీలకు రూ.1000 ఇచ్చి మొత్తం తానే ఇచ్చినట్లుగా జగన్ రెడ్డి చెప్పుకుంటున్నాడని విమర్శించారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి మోసగించారన్నారు. ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని ఎవరు రెచ్చగొట్టి మోసగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పేదలు నిరుపేదలవుతున్నారు..
సంపద సృష్టించకుండా దిల్లీ వెళ్లి బీద అరుపులు అరిస్తే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందా? అని చంద్రబాబు నిలదీశారు. ప్రతీ వ్యక్తిపై రూ.లక్ష, ప్రతీ కుటుంబంపై రూ.5 లక్షల వరకూ అప్పు భారం మోపారని ధ్వజమెత్తారు. పార్కులు, కలెక్టరేట్లు, ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టినవారు... ఇక రోడ్లు, ప్రైవేటు ఆస్తులూ తాకట్టు పెడతారని దుయ్యబట్టారు. జగన్ చేసే అప్పులు ఆకాశం నుంచి వచ్చి ఎవ్వరూ కట్టరన్న చంద్రబాబు.. ప్రజలే కట్టాలని హెచ్చరించారు. వైకాపా నేతలు కోటీశ్వరులవుతుంటే పేదలు నిరుపేదలుగా మారుతున్నారని వాపోయారు. ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్​ను చరిత్ర క్షమించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక అంశాలపై సీఎం జగన్ ప్రసంగాలు, కేంద్ర స్పందనలకు సంబంధించిన పలు వీడియోలను మీడియా సమావేశంలో చంద్రబాబు ప్రదర్శించారు.

ఏపీని అంధకారంలోకి నెట్టారు..
ఏపీలో ఫ్యాన్ అధికారంలోకి వచ్చి విద్యుత్ కష్టాలను తీసుకొచ్చిందని చంద్రబాబు విమర్శించారు. 32 నెలల్లో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.11 వేల కోట్ల భారం ప్రజలపై మోపారని దుయ్యబట్టారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రూ.26,261 కోట్లను పక్కదారి పట్టించారని విమర్శించారు. రూ.3 వరకు అందుబాటులో ఉన్న యూనిట్ సోలార్ విద్యుత్​ను కాదని కమీషన్ల కోసం రూ.15కు కొంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ మోసకారి తనాన్ని ప్రజలు ఆనాడు అర్థం చేసుకోలేకపోవటం వల్లే.. రాష్ట్రం భ్రష్టు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులకూ.. రాష్ట్ర వాటా ఇవ్వలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని ఆక్షేపించారు.

ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళుతోంది.. ?
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలోనే పెట్రోల్, గ్యాస్, లిక్కర్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తోందని నిలదీశారు. రూ. 2 లక్షల కోట్ల విలువ చేసే అమరావతిని నాశనం చేసినందున రాజధాని ఎక్కడ ఉందో చెప్పలేని దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు ఇప్పటికీ హైదరాబాద్ రాజధాని అని చెప్పుకొనే పరిస్థితి వచ్చిందన్నారు. విభజన చట్టం వల్ల ఏపీకి నష్టం జరిగిందన్న చంద్రబాబు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే ఆపలేని పరిస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. ఏపీలో వ్యవసాయ శాఖను ఎత్తేయటంతో పాటు రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉందని విమర్శించారు.

ఇదీచూడండి:Chandrababu On Debts: 'జగన్​ చేసిన అప్పులు... ప్రజలే తీర్చాలి'

ABOUT THE AUTHOR

...view details