Chandrababu on CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం గాడిన పడిందన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం బాగుంటే ప్రభుత్వ వైఫల్యాలు.. సామాన్యుడి జీవితాలను ఎందుకు ఛిద్రం చేస్తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలనా దుస్థితికి పలు ఘటనలే ఉదాహరణలు అని తెలిపారు. ప్రజలను పీడిస్తూ వసూలు చేస్తున్న పన్నులు ఎటు పోతున్నాయని నిలదీశారు. రూ.లక్షల కోట్ల అప్పులు ఏమవుతున్నాయని ధ్వజమెత్తారు.
కాకినాడ జిల్లా జె.తిమ్మాపురంలో ఆసుపత్రికి వెళుతున్న పసిబిడ్డ.. గుంతల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన ఘటనను చంద్రబాబు ప్రస్తావించారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ బిల్లులు మంజూరు కాక.. క్యాన్సర్ బాధితుడైన తండ్రి వైద్యానికి డబ్బులు లేక వేదన పడుతున్న లేపాక్షి మండలం వెంకట శివప్ప ఘటనను వివరించారు. రాష్ట్ర ఆదాయం గాడిన పడిందన్న సీఎం సమీక్ష వార్తను, వారం రోజులు అయినా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పడని అంశాన్ని పోల్చుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రభుత్వం.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.