తెలంగాణ

telangana

ETV Bharat / city

పరిషత్​ ఎన్నికలను బహిష్కరించిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం - ఏపీ పరిషత్ ఎన్నికల వార్తలు

ఏపీలో పరిషత్‌ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. పొలిట్‌బ్యూరో నేతలు, పోటీలో ఉన్న పార్టీ అభ్యర్థులతో సుదీర్ఘ చర్చలు జరిపిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు దూరంగా ఉన్నంతమాత్రాన తాము వెనక్కి తగ్గినట్లు కాదని.. రాజకీయంగా పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తేల్చిచెప్పారు.

cbn
cbn

By

Published : Apr 3, 2021, 6:46 AM IST

పరిషత్​ ఎన్నికలను బహిష్కరించిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం

ఏపీలో త్వరలో జరగనున్న పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా మారాయని ఆయన ఆరోపించారు. పరిషత్‌ ఎన్నికల తేదీలను మంత్రులు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. కొత్త ఎస్‌ఈసీ నీలం సాహ్ని వచ్చీ రాగానే పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారని ఆక్షేపించారు. పరిషత్‌ ఎన్నికల్లో ఎస్‌ఈసీ రబ్బర్‌స్టాంపుగా మారారని ఆరోపించారు. 2014లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో 2 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవమైతే.. తాజా ఎన్నికల్లో 24 శాతం ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. 2014లో 1శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవమైతే ఈసారి 19శాతం అయ్యాయని గుర్తు చేశారు. అధికార వైకాపా దౌర్జన్యాలు, అక్రమాలతోనే బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తామనే అభ్యర్థులను పోలీసులు బెదిరించారని మండిపడ్డారు.

'అప్రజాస్వామిక నిర్ణయాల్లో భాగస్వాములం కాలేం'

పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పి ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్నాయని విమర్శించారు. పరిషత్‌ ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుతంగా జరుగుతాయనే నమ్మకం తమకు లేదని.. ఈ పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదన్నారు. అప్రజాస్వామిక నిర్ణయాల్లో భాగస్వాములం కాలేమని.. ఎస్‌ఈసీ తీరుకు నిరసనగా తమ పార్టీ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. తెదేపా నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నామన్నారు. ఎన్నికల బహిష్కరణ పట్ల బాధ, ఆవేదన ఉందని చెప్పారు.

అందుకే కఠిన నిర్ణయం..

ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో దివంగత సీఎం జయలలిత, మాజీ సీఎం జ్యోతిబసు కూడా స్థానిక ఎన్నికలను బహిష్కరించారని గుర్తు చేశారు. తన రాజకీయ జీవితంలో ఇంత కఠిన నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదన్నారు. స్థానిక ఎన్నికల్లో వైకాపా అక్రమాలపై జాతీయస్థాయిలో పోరాడతామని చంద్రబాబు చెప్పారు.

ఇదీ చదవండి:నాగార్జునసాగర్​ ప్రచారం: అభ్యర్థనలు.. భావోద్వేగాలు

ABOUT THE AUTHOR

...view details