కార్పొరేట్ ఆసుపత్రిలో లక్షల్లో సంపాదిస్తున్న భార్య కృష్ణభారతిని తన గ్రామంలో ఉచితంగా వైద్యం చేయమన్నప్పుడు ప్రభాకరన్‌ను అందరూ ఆశ్చర్యంగా చూశారు. కొందరైతే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు కూడా. ప్రభాకరన్ మాత్రం అదే తన భార్య ఇచ్చే కట్నమన్నప్పుడు ఆయన పెద్ద మనసు కృష్ణభారతికి అర్థమైంది. ఆ కోరిక నెరవేర్చడానికి సిద్ధపడిందామె.
ఈమధ్యనే వీళ్ల పెళ్లైంది. ఇప్పుడు కృష్ణభారతి వారానికోసారి వెళ్లి ఆ గ్రామస్థులకు ఉచితంగా వైద్యం చేస్తోంది.
ప్రభాకరన్ కుటుంబానిది తంజావూరు జిల్లా మేలఒట్టంకాడు. కనీస సౌకర్యాల్లేని పల్లె. దగ్గర్లో ఆసుపత్రులు కూడా లేవు. ఖర్చవుతుందనో, ఆసుపత్రి సౌకర్యం లేనందుకో గానీ అక్కడివాళ్లెవరూ ఆరోగ్యం మీద దృష్టి పెట్టరు. ప్రభాకరన్ తల్లీ, చెల్లీ కూడా అంతే. అందుకే తన గ్రామంలో వైద్యసేవలు అందించాలనుకున్నాడు. తన ఆశయాన్ని భార్య భారతి నెరవేర్చుతోంది.
ప్లాట్‌ఫామ్‌పై పడుకుని
ప్రభాకరన్‌ది రైతు కుటుంబం. చిన్నతనంలోనే తండ్రి తాగుడుకు బానిసవడంతో ఉన్న కాస్త పొలాన్నీ అమ్మాల్సొచ్చింది. తల్లి కూలి పనులకు వెళ్లడంతోపాటు చీపుర్లు అమ్మి కుటుంబాన్ని పోషిస్తుండేది. ప్రభాకరన్‌కి చదువంటే ఇష్టం. మంచి పనులు చేసే ఓ కలెక్టర్ గురించి పేపర్లో చదివి తానూ ఐఏఎస్ అవ్వాలనుకున్నారు. అందుకే కూలి పనులకు వెళ్తూ ఇంటర్ వరకూ చదివాడు. ఆ తరవాత ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో చదువు మానేసి ఓ టింబర్ డిపోలో పనికి కుదిరాడు.
మరోవైపు కొంత పొలం కౌలుకు తీసుకుని సాగు మొదలుపెట్టాడు. ఆ పనులతో రేయింబవళ్లూ రెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. అయినా ప్రభాకరన్ ధ్యాస చదువుపైనే ఉండటంతో రెండేళ్ల తరవాత ఆ పనులు మానేసి ఎంసెట్ రాశాడు. మంచి ర్యాంకుతో వెల్లూర్‌లోని ఓ ప్రభుత్వ కాలేజీలో సీటు వచ్చింది. అక్కడే ఓ గది అద్దెకు తీసుకున్నాడు. కాలేజీ అయ్యాక ఓ సెల్‌ఫోన్ షాపులో పార్ట్‌టైం ఉద్యోగం చేసేవాడు. బీటెక్ మూడో సంవత్సరంలో ఉన్నప్పుడు ఎమ్‌టెక్ చదవాలనుకున్నాడు.
చెన్నైలో ఒకతను పేదలకి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారని తెలిసింది. అలాగని చదువును వదిలేసి చెన్నైలో ఉండే పరిస్థితి లేదు. కోచింగ్ శని, ఆదివారాల్లోనే ఉంటుంది. శనివారం ఇంటికి వెళ్లి మళ్లీ ఆదివారం రావాలంటే ఖర్చవుతుందని శనివారం క్లాస్ అవ్వగానే ప్లాట్‌ఫామ్‌పైనే పడుకునేవాడు. మర్నాడు కోచింగ్ చూసుకుని తిరిగి వెళ్లిపోయేవాడు. అపరిశుభ్రమైన ఆ ఫ్లాట్‌ఫామ్‌పైన దుర్వాసనలతో ముక్కుపుటాలదిరినా పంటిబిగువున భరించాడు. రెండేళ్లు అంత కష్టపడి చదివినందుకుగానూ ఐఐటీ మద్రాస్‌లో సీటు వచ్చింది. కేంద్రప్రభుత్వ ఉపకార వేతనానికీ ఎంపికయ్యాడు.
లుంగీమ్యాన్‌గా...
ప్యాంట్లు కొంటే ఖర్చవుతుందని లుంగీతోనే క్లాస్‌లకి వెళ్లేవాడు. అందరూ ‘లుంగీమ్యాన్’ అని ఏడిపించేవారు. అయినా కష్టపడి చదివి- 2014లో 9.0 జీపీఏ సాధించి ఎమ్‌టెక్ పూర్తి చేశాడు. సివిల్స్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇంట్లోనే ఉండి చదువుకుంటూ... పొలం పనులకు వెళ్తుండేవాడు. అలా చదువుతూ ప్రవేశ పరీక్ష రాసిన ప్రభాకరన్ మూడుసార్లు విఫలమయ్యాడు. నాలుగోసారి మాత్రం పనులన్నీ మాని ప్రయత్నించాడు. అది ఫలించి 2017లో 101వ ర్యాంకు తెచ్చుకుని ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఆయన తిరునెల్వేలి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్. అంతేనా.. వేల మంది విద్యార్థులకు మోటివేషనల్ స్పీకర్ కూడా!