కాంచీపురం జిల్లా ‘రాజ్యలక్ష్మి ఇంజినీరింగ్ కాలేజీ’లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న కృతిక, జయశ్రీ, కవితల మాటల్లో అంబులెన్స్ ఆలస్యాల చర్చ వచ్చింది. దీనికో పరిష్కారాన్ని కనిపెట్టాలనుకున్నారు. ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు, ఆలోచనల కలబోత అనంతరం వీరి మేలిమి ఆలోచన సాకారమైంది.
అంబులెన్స్‌కే ఆపద్బాంధవులు!
సిగ్నల్‌కి అమర్చిన సౌండ్ సెన్సర్లు అంబులెన్స్ 120 మీటర్ల దూరంలో ఉండగానే ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చేలా చేస్తాయి. దాంతో అంబులెన్స్ వెళ్లే దిశలో సిగ్నల్‌లో ఎరుపు సంకేతమున్నా తక్షణం ఆకుపచ్చగా మారిపోయి తక్కిన దిశల్లో ఎరుపు సూచిస్తుంది. దాంతో వాహనానికి అడ్డు తొలగిపోతుంది. అది వెళ్లిపోగానే సిగ్నల్స్ యథాతథంగా పనిచేస్తాయి. ఇదెంతో సులువైన ఏర్పాటు. ఉపయోగించిన సెన్సర్లు, డివైజ్‌ల ఖర్చు కూడా నామమాత్రం.
ఈ ప్రాజెక్టులో విద్యార్థినులకు దిశానిర్దేశం చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రీటా ‘సిగ్నల్స్‌లో సెన్సర్లు బిగిస్తే చాలు అంబులెన్సులకు ఏ ఆటంకమూ ఉండదు.. బాధితులకు తక్షణం సేవలందుతాయి. వ్యయ ప్రయాసల్లేని గొప్ప ఆవిష్కరణ. ఇకపై ఆలస్యాలు వద్దు’ అంటున్నారు. ‘ఇంటర్నేషనల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ’ పత్రిక ఈ ఆవిష్కరణను ప్రశంసించింది. తాజా గణాంకాలను బట్టి ప్రధాన రహదారుల్లో (హైవే) ఏటా లక్షన్నర ప్రమాదాలు జరుగుతున్నాయి. సమయానికి అంబులెన్స్ రాగలిగితే వేలాది ప్రాణాలు నిలుస్తాయి. అందుకు ఇలాంటి ఆవిష్కరణలు ఎంతో దోహదం చేస్తాయి.