తెలంగాణ

telangana

ETV Bharat / city

Ugadi Wishes: 'ఈ ఉగాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి' - ఉగాది వార్తలు

Ugadi Wishes: రాష్ట్ర ప్రజలకు గవర్నర్​, సీఎం, రేవంత్​ రెడ్డి, బండి సంజయ్​ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవున్ని ప్రార్థించారు.

Ugadi wishes
Ugadi wishes

By

Published : Apr 1, 2022, 7:19 PM IST

Ugadi Wishes: ఉగాది పండుగ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలు, ప్రపంచంలోని తెలుగు వారందరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు చెప్పారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం తెలుగు వారి జీవితాల్లో వెలుగు నింపాలని... ఈ సంవత్సరం అంతా తెలుగు ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలని ఆకాంక్షించారు.

అనతి కాలంలోనే దేశం గర్వించేలా తెలంగాణ: కేసీఆర్​...పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న శ్రీశుభకృత్ నామ సంవత్సరం... ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతోందని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఉగాది నుంచే నూతన సంవత్సరం ఆరంభమౌతుందని... రైతన్నలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచే ప్రారంభించుకుంటారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అధిక ప్రోత్సాహాన్ని అందిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. రైతన్నల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం, దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని చెప్పారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ అనతి కాలంలోనే దేశం గర్వించేలా కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధించిందని కేసీఆర్ అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని వివరించారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని వెల్లడించారు.

పంటలను ప్రభుత్వం కొనాలి: రేవంత్​...తెలంగాణ ప్రజలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో అయినా సకల జనులకు శుభం కలుగాలని ఆకాంక్షించారు. ఈ కొత్త సంవత్సరంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, రైతులు పండించిన పంటలను మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని, తెలంగాణ మత్తుమందుల రహిత రాష్ట్రంగా ఏర్పడి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ధరలు పెరుగుదల నియంత్రణలోకి వచ్చి సామాన్యులకు అందుబాటులోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు.

తెరాస ప్రభుత్వం పీడ విరగడై పోవాలని: బండి....ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సనాతన ధర్మం విశ్వమానవాళికి అనేక శ్రేయోమార్గాలను చూపించిందని పేర్కొన్నారు. కుటుంబ, నియంత, అవినీతి పాలన సాగిస్తూ మోయలేని పన్నుల భారాన్ని మోపుతున్న తెరాస ప్రభుత్వం పీడ విరగడై పోవాలని, శుభ‌కృత్‌ నామ సంవత్సరంలో పాడి పంటలు, ఆయురారోగ్యాలతో తులతూగేలా చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి :'అవసరమైతే నూకలు తింటాం, కేంద్రాన్ని గద్దె దించుతాం'

ABOUT THE AUTHOR

...view details