కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం వికారాబాద్ మండలం మదన్‌పల్లిలో రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మదన్‌పల్లిలో 400ఎకరాల భూమికి పట్టాలు ఇవ్వలేదని రైతులు తెలిపారు.
అన్ని పంటలకు ఇదే గతి :
వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్ కంపెనీలకు లాభం తప్ప సాధారణ రైతులకు ఉపయోగం లేదన్నారు. టమాటా రైతులు ధరలేక తమ పంటను రహదారుల పక్కన పారబోస్తున్నారని ఆరోపించారు. ఈ చట్టాలు అమలైతే భవిష్యత్తులో అన్ని పంటలకు ఇదే గతి పడుతుందన్నారు. సన్న ధాన్యం పండించాలని చెప్పి సీఎం ఇప్పుడు కొనుగోలు మాటెత్తడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు.