ఏళ్ల తరబడి సాగుచేస్తున్న భూములకు హక్కులు పొందాలంటే కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లూ తహసీల్దారు కార్యాలయాల నుంచి పాసుపుస్తకాలు పొందే వెసులుబాటు ఉండేది. ధరణి (టీఎల్‌ఆర్‌ఎంఎస్) పుణ్యమా అని.. కొన్నిరకాల ఐచ్ఛికాలు (ఆప్షన్స్) తహసీల్దార్ల పరిధి నుంచి తొలగించారు. ఇప్పుడిదే పేద రైతులపాలిట సమస్యగా మారింది. సర్వే నంబర్లు తప్పిపోవడం, ఆర్‌ఎస్‌ఆర్ ఖాతా సమస్యలు, ఓఆర్‌సీ జారీ(భూమి హక్కు ధ్రువీకరణ పత్రం), విస్తీర్ణాల్లో తేడాలు లాంటి సమస్యలను పరిష్కరించడం తహసీల్దార్ల పరిధిలో లేదు. తహసీల్దారు కార్యాలయాలకు వచ్చిన రైతులను ఆర్డీవో, కలెక్టరేట్లకు వెళ్లాలంటూ చెబుతున్నారు.
రైతుబంధు, రైతుబీమా రావట్లేదు...
రాష్ట్రవ్యాప్తంగా పాసుపుస్తకాలు చేరని మూడున్నర లక్షల రైతులతోపాటు జారీచేసిన పుస్తకాల్లో తప్పులు, ఇతర పొరపాటు దొర్లిన వారు మానసిక వ్యథ అనుభవిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా వర్తించడం లేదు. బ్యాంకు రుణాలకూ రైతులు దూరమయ్యారు. సాంకేతికాభివృద్ధి ఫలాలు పేదలు, సామాన్యుల కష్టాలు తీర్చాలి. దీనికి భిన్నంగా రెవెన్యూశాఖ రూపొందించిన కొత్త సాంకేతికత పేద రైతుల జేబు గుల్ల చేస్తోంది. తహసీల్దారు కార్యాలయం పరిధి నుంచి భూదస్త్రాలు, పాసుపుస్తకాల సవరణకు సంబంధించిన పలు అంశాలను ఆర్డీవో, సంయుక్త కలెక్టర్లకు అప్పగించారు. వారు ఆమోదం తెలిపితేనే పరిష్కారమయ్యేలా విధానం తీసుకొచ్చారు. దీంతో చిన్న సవరణలనూ తహసీల్దార్లు చేయలేని పరిస్థితి.
భూముల నిర్వహణ పూర్తి బాధ్యత తహసీల్దార్ది కాదిప్పుడు..