తెలంగాణ

telangana

ETV Bharat / city

యాంటీబాడీలు పెరగకున్నా ఫర్వాలేదు... వ్యాక్సిన్‌తో ప్రయోజనమే!

కొవిడ్‌ టీకా తీసుకుంటే, కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. అవి వైరస్‌పై పోరాడి రక్షణగా నిలుస్తాయి. అయితే రెండు డోసులు పొందిన తర్వాత కూడా కొందరిలో యాంటీబాడీలు తగినంతగా వృద్ధి చెందడంలేదని ఇటీవలే పరిశోధకులు గుర్తించారు. ఇలా ఎందుకు జరుగుతుంది? టీకాను నిర్దేశిత సమయం ప్రకారం రెండు డోసులూ తీసుకున్నా యాంటీబాడీలు వృద్ధి చెందకపోవడానికి కారణాలేమిటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇదేమీ అసాధారణం కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు.

t cells effecting from corona virus
t cells effecting from corona virus

By

Published : Mar 12, 2021, 6:40 AM IST

యాంటీబాడీలు వృద్ధి చెందనంత మాత్రాన ఆందోళన చెందనక్కర్లేదని, టి-కణాల వంటి కణాధారిత రోగ నిరోధక శక్తిని కొవిడ్‌ టీకా ప్రేరేపితం చేస్తుందని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. భవిష్యత్తులో కొవిడ్‌ సోకితే, టి-కణాలు వైరస్‌పై సమర్థంగా పోరాడతాయని చెబుతున్నారు. కొవిడ్‌ టీకా స్వీకరించడం వల్ల అన్ని విధాలుగా ప్రయోజనాలే చేకూరుతాయని స్పష్టం చేస్తున్నారు.

ఒక్కొక్కరిలో ఒక్కో తీరు స్పందన

ఒకేస్థాయి ఇన్‌ఫెక్షన్‌ శరీరంలోకి వెళ్లినప్పుడు కొందరికి అసలు ఎలాంటి లక్షణాలూ లేకపోవచ్చు. మరికొందరికి స్వల్పంగా, ఇంకొందరిలో తీవ్ర లక్షణాలు కనిపించవచ్చు. ఏ టీకా వేయించుకున్నా, సంబంధించిన యాంటీబాడీలు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ స్పందనను బట్టి వృద్ధి చెందుతాయి. దీన్నే ‘యాంటీబాడీ కోడింగ్‌’ అంటారు. ఆ కోడ్‌ను మన రోగ నిరోధక వ్యవస్థ గుర్తుపెట్టుకుంటుంది. ఉదాహరణకు ఒక వైరస్‌ వల్ల జలుబు చేస్తే, దానికి ప్రతిగా శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. రెండోసారి అదే వైరస్‌ దాడి చేస్తే, అప్పుడు దాని ప్రభావం అంతగా ఉండదు. కొవిడ్‌ టీకా తీసుకున్నవారిలో కూడా దీనికి సంబంధించిన యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. కానీ అవి అందరిలోనూ ఒకే తరహాలో వృద్ధి చెందకపోవచ్చు. ఉదాహరణకు ఒకే వయసున్న ముగ్గురు వ్యక్తులకు ఏకకాలంలో ఒకే టీకాను ఒకే మోతాదులో ఇచ్చినప్పుడు.. ఒకరికి 5 యాంటీబాడీలు, మరొకరికి 10, మూడో వ్యక్తికి 50 యాంటీబాడీలు ఉత్పత్తి కావచ్చు. ఆయా వ్యక్తుల్లో రోగ నిరోధక వ్యవస్థ స్పందనే దీనికి కారణం. యాంటీబాడీలు తగినంతగా వృద్ధి చెందకపోయినా, రోగ నిరోధక వ్యవస్థలో అత్యంత కీలకంగా వ్యవహరించే టి-కణాలను మాత్రం టీకా ప్రేరేపితం చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. టీకా పొందిన తర్వాత వైరస్‌ బారినపడినా... దాని ప్రభావం చాలా స్వల్పంగా ఉంటుందని వివరిస్తున్నారు. ఉదాహరణకు టీకా పొందని వ్యక్తి కొవిడ్‌ బారినపడి ఆసుపత్రి ఐసీయూలో 10 రోజులు తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందాల్సి వస్తే, టీకా పొందిన వ్యక్తికి కొవిడ్‌ సోకినా, అటువంటి తీవ్ర అస్వస్థతకు దారి తీయదు. స్వల్ప లక్షణాలు, చికిత్సతోనే బయటపడే అవకాశాలుంటాయి. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో టీకాలు సమర్థ పాత్ర పోషిస్తాయని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా దిగ్గజ వైద్యనిపుణులు కూడా పదేపదే చెబుతూనే ఉన్నారు.

టి-కణాలతో రక్షణ
- డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్లా, శ్వాసకోశ వైద్యనిపుణులు, ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ

యాంటీబాడీలు వృద్ధి చెందకపోయినా, ప్రేరేపిత టి-కణాల వల్ల కొవిడ్‌ నుంచి రక్షణ లభిస్తుందనేది స్పష్టం. ఈ విషయంలో పూర్తిస్థాయి అధ్యయనాలు త్వరలో వెలువడే అవకాశాలు ఉన్నాయి. కొవిడ్‌ టీకా ద్వారా యాంటీబాడీల వృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జోరుగా జరుగుతున్నాయి. వీటిపై కొన్ని విదేశీ వైద్యపత్రికల్లో విశ్లేషణలు వచ్చాయి. అమెరికా, యూరప్‌ దేశాల్లో మన కంటే సుమారు మూడు నెలల ముందుగానే టీకాల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. ఆయా దేశాల్లో రెండు డోసుల అనంతరం యాంటీబాడీల వృద్ధిపై పరిశోధనలు జరిగాయి. ఇప్పటి వరకూ వెల్లడైన సమాచారం మేరకు సుమారు 25-30 శాతం మందిలో యాంటీబాడీలు పూర్తిస్థాయిలో వృద్ధి చెందలేదని తేలింది. అయినా వారిలో టి-కణాలు రక్షణగా నిలుస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్‌లోనూ ఈ కోణంలో అధ్యయనాలు జరుగుతున్నాయి.

టీకా పొందడం మానొద్దు
- డాక్టర్‌ కె.కిరణ్‌ ప్రకాశ్‌, సహాయ ఆచార్యులు, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్యకళాశాల

టీకా ద్వారా వైరస్‌కు చెందిన యాంటీజెన్‌ను శరీరంలో ప్రవేశపెడతారు. తద్వారా ఆ వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. టీకా పొందిన వ్యక్తుల్లో రోగ నిరోధక వ్యవస్థ యాంటీజెన్‌ను గుర్తించడంలో సమర్థంగా పనిచేయకపోతే.. వారిలో యాంటీబాడీలు ఆశించిన స్థాయిలో వృద్ధి చెందవు. దీనిపై ఆందోళన చెందనవసరం లేదు. అవసరమైన సందర్భాల్లో ‘టి’ వంటి రోగ నిరోధక కణాలు వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అనవసర అపోహలతో టీకాలకు దూరం కావద్దు. కొవిడ్‌ టీకాను పొందడం వల్ల ప్రయోజనమే కానీ నష్టం లేదు.

ఇదీ చూడండి: నత్త నడకన కాళేశ్వరం 17, 18, 19 ప్యాకేజీల పనులు

ABOUT THE AUTHOR

...view details