తెలంగాణ

telangana

ETV Bharat / city

పాఠశాలల్లో స్వీపర్లకు వేతనాలు ఇవ్వాల్సిందే...

పాఠశాలల్లో స్వీపర్లకు జీతాలపై సర్కారుకు హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్‌ పాఠశాలల్లో స్వీపర్లుగా పనిచేస్తున్న వారికి 4 వారాల్లో వేతనాలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్‌ 1కి వాయిదా వేశారు.

high court orders, Sweepers in schools
high court orders to telangana government

By

Published : Mar 27, 2021, 7:31 AM IST

పంచాయతీరాజ్‌ పాఠశాలల్లో స్వీపర్లుగా పనిచేస్తున్న వారికి 4 వారాల్లో వేతనాలు చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రంగారెడ్డి, వికారాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, సూర్యాపేట, రాజన్నసిరిసిల్ల, నల్గొండ జిల్లాల్లో పంచాయతీరాజ్‌ పాఠశాలల్లో స్వీపర్లుగా పనిచేస్తున్న తమకు.. రెగ్యులర్‌ పోస్టుల్లో ఆ పని చేస్తున్న వారికి ఇస్తున్న మాదిరి వేతనాలు చెల్లించడం లేదని ఖాసింతో పాటు మరో 45 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు... సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలంటూ 2018 మార్చి 15న ఆదేశాలు జారీ చేశారు. ఆ తీర్పు అమలుకాకపోవడం వల్ల... మళ్లీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

శుక్రవారం రోజున జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు మరోసారి విచారణ చేపట్టారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... అర్హులైనవారికి, పూర్తిస్థాయిలో విధులు నిర్వహించిన తాత్కాలిక ఉద్యోగులకు సమాన వేతనం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ‘‘జీవో కాదు. ఎంత చెల్లించారో చెప్పండి. కోర్టు ఉత్తర్వులు ఇచ్చి ఇప్పటికే మూడేళ్లయింది. స్వీపర్లు ఉదయమే శుభ్రం చేసి మనం అనువుగా జీవించడానికి సహకరిస్తున్నారు. అలాంటివారి పట్ల కొంత కరుణ చూపాలి. వారికేమీ లక్షల్లో వేతనాలు ఉండవు. ఇచ్చే కొద్ది మొత్తమైనా ఇవ్వకపోతే ఎలా...?’’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన వికాస్‌రాజ్‌ మూడు నెలల గడువు కావాలని కోరారు. న్యాయమూర్తి నిరాకరిస్తూ... 4 వారాల్లో చెల్లించాల్సిందేనన్నారు.

ప్రభుత్వ న్యాయవాది వికాస్‌రాజ్ జోక్యం చేసుకుంటూ... ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖకు బదిలీ అయ్యారని చెప్పగా న్యాయమూర్తి స్పందిస్తూ... ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్‌ 1కి వాయిదా వేశారు.

ఇదీ చూడండి: పొద్దునేమో భానుడి భగభగ... రాత్రిపూట ఉక్కపోత

ABOUT THE AUTHOR

...view details