KTR on Swachh Survekshan Awards: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్, ఇండియన్ స్వచ్ఛతా లీగ్‌లో అవార్డులు అందుకొన్న పట్టణ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అభినందన సమావేశం నిర్వహించింది. హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన సమావేశానికి ఆయా పట్ణణాల మేయర్లు, ఛైర్ పర్సన్లు, డిప్యూటీలు, కమిషనర్లు, ఇంజనీర్లు, సంబంధిత జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు హాజరయ్యారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వారిని అభినందించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 13 పట్టణాలకు కేంద్ర అవార్డులు రాగా... ఇండియన్ స్వచ్ఛతా లీగ్‌లో మరో మూడు అవార్డులు లభించాయి. ఈ ఏడాది 25 అవార్డులు రావాలని నిరుడు మంత్రి ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయామన్న పురపాలక సంచాలకులు సత్యనారాయణ... ఎక్కువ అవార్డులతో జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని సంపాదించినట్లు చెప్పారు. మరింత గట్టిగా కృషి చేసి వచ్చే ఏడాది మరిన్ని ఎక్కువ అవార్డులు వచ్చేలా ప్రయత్నిస్తామని అన్నారు. రాష్ట్రం మంచి పనితీరు కనబరచినప్పటికీ లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో ఒక్క అవార్డు కూడా రాలేదన్న పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్... జీహెచ్ఎంసీ సహా చాలా పట్టణాల్లో తక్కువ మార్కులతో అవార్డులను కోల్పోయామని అన్నారు. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదా అన్ని పట్టణాలకు వచ్చేలా చూడాలని, చెత్త సేకరణ ప్రక్రియను ఇంకా పకడ్బందీగా చేయాల్సి ఉందని సూచించారు.
దేశంలోనే రెండో అత్యధిక అవార్డులు వచ్చిన రాష్ట్రంగా తెలంగాణ ఉండడం గర్వకారణమన్న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్... మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రకు 4.92 శాతం అవార్డులు వస్తే రాష్ట్రానికి పది శాతానికి పైగానే వచ్చాయని తెలిపారు. గ్రామాలు, పట్టణాలు అన్నీ బాగానే ఉన్నాయని కేంద్రమే చెబుతూ అవార్డులు ఇస్తూనే... మళ్లీ పనికిమాలిన మాటలు కూడా వాళ్లే మాట్లాడుతుంటారని ఆక్షేపించారు. క్షేత్రస్థాయిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్న ఆయన... ఇంకా చాలా చేయాల్సి ఉందని అన్నారు. అవార్డులు దక్కించుకున్న 19 పట్టణాలకు రెండు కోట్ల రూపాయలు చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించిన మంత్రి... ఆ నిధులను పారిశుద్ధ్యం కోసం వినియోగించేలా చూడాలని చెప్పారు. అవార్డులు పొందిన పట్టణాల మేయర్లు, చైర్ పర్సన్లు, కమిషనర్లను దేశంలోని ఇతర పట్టణాల్లో అధ్యయనానికి పంపిస్తామని... అందులో పది మందిని ఎంపిక చేసి జపాన్, సింగపూర్ కు పంపిస్తామని తెలిపారు.