తెలంగాణ

telangana

ETV Bharat / city

శాసనసభ నుంచి ఈటల రాజేందర్‌ సస్పెన్షన్‌ - అసెంబ్లీ సమావేశాల నుంచి ఈటల సస్పెన్షన్‌

etela rajender
etela rajender

By

Published : Sep 13, 2022, 10:15 AM IST

Updated : Sep 13, 2022, 11:23 AM IST

10:12 September 13

సభ నుంచి ఈటల రాజేందర్‌ సస్పెన్షన్‌

Etela suspension from House: తెలంగాణ శాసనసభ నుంచి భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సస్పెండ్‌ చేశారు. స్పీకర్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయన్ను సస్పెండ్‌ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్‌ పోచారం స్పందిస్తూ ఈటలను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

సారీ చెప్పాలంటూ తెరాస పట్టు.. సస్పెన్షన్‌కు ముందు సభలో తెరాస సభ్యులు, ఈటల రాజేందర్‌ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. సభాగౌరవాన్ని పాటించకుండా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున సభ నుంచి ఈటలను సస్పెండ్‌ చేయాలంటూ తెరాస సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్‌ను ‘మర మనిషి’ అంటూ ఈటల సంబోధించారని.. సభకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ కోరారు. సభలో కొనసాగే అర్హత ఆయనకు లేదని మరో సభ్యుడు బాల్క సుమన్‌ అన్నారు.

అనంతరం ఈటల మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలగజేసుకుని క్షమాపణలు చెప్పాకే చర్చలో పాల్గొనాలని కోరారు. ఈటల అమర్యాదగా మాట్లాడారని.. సభలో చర్చ కంటే బయట రచ్చకే ఆయన మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్యానించారు. సస్పెండ్‌ చేయించుకోవాలని చూస్తున్నారన్నారు. ఈటల రాజేందర్‌ సభలో ఉండాలనే తాము కోరుకుంటున్నామని.. క్షమాపణలు చెప్పి సభలో జరిగే అన్ని చర్చల్లో పాల్గొనాలని చెప్పారు. అలా జరగని పక్షంలో తాము తదుపరి చర్యలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.

ఆ తర్వాత స్పీకర్‌ స్పందిస్తూ సభా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని.. సభ మూడ్‌ను అర్థం చేసుకోవాలని ఈటలకు సూచించారు. మరోవైపు తెరాస సభ్యులు నినాదాలు చేస్తుండటంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సభ్యుడిగా సభలో మాట్లాడే అవకాశం తనకు ఉందా? లేదా? బెదిరిస్తున్నారా? ఏం చేస్తారు?’ అంటూ మండిపడ్డారు. క్షమాపణలు చెప్పకపోవడంతో సభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఈటలను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. సభ నుంచి బయటకు వచ్చిన ఈటల.. తన వాహనంలో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 13, 2022, 11:23 AM IST

ABOUT THE AUTHOR

...view details