తెలంగాణ

telangana

ETV Bharat / city

దాతలిచ్చిన మాస్కులు, శానిటైజర్లు మాయం - ఆసుపత్రిలో సామగ్రి మాయం

కరోనా కారణంగా వైద్యులు, రోగుల కోసం స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సాయాన్ని కింగ్‌కోఠి ఆసుపత్రిలోని కొందరు వైద్య సిబ్బంది పక్కదోవ పట్టించారు. బయట అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. మాస్కులు, చేతి తొడుగులు, శానిటైజర్లు, ఫేస్​షీల్డులు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

Surgical Equipment disappear in King Koti Hospital
Surgical Equipment disappear in King Koti Hospital

By

Published : Apr 8, 2021, 11:36 AM IST

హైదరాబాద్​లోని కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో కరోనాకు ప్రత్యేకించి 350 పడకలతో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ చికిత్స పొందే కరోనా బాధితులు, వైద్య సిబ్బందికి ఉపయోగపడేలా స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఎన్‌95 మాస్కులు, సర్జికల్‌ మాస్కులు, చేతి తొడుగులు, శానిటైజర్లు, ఫేస్​షీల్డులు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు వీటిని ఫార్మసీకి అప్పగించి రిజిస్టర్‌లో నమోదు చేయించాలి. వైద్యాధికారుల అండదండలతో ఆ సామగ్రిని కొందరు సిబ్బంది పెద్దఎత్తున పక్కదారి పట్టించారు.

రక్తాన్ని పీల్చుతున్న జలగలు

ఆసుపత్రిలో కరోనా బాధితులకు రక్త పరీక్షలు చేసేందుకు ఆరు నెలల కిందట ఓ ప్రైవేటు ల్యాబ్‌కు అనధికారికంగా కొందరు వైద్యాధికారులు అనుమతిచ్చారు. ఇందులో రక్త పరీక్షకు రూ.4500 వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని పలువురు వైద్యులు, సిబ్బంది వాటాలుగా పంచుకుంటున్నారు. ఈ విషయం తెలిసి మరో ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాహకులు తాము రూ.3500కే పరీక్ష చేస్తామని ప్రతిపాదించారు. ఆసుపత్రిలోని టెక్నీషియన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినా, ప్రైవేటు ల్యాబ్‌ నిర్వహిస్తుండడం గమనార్హం.

రోగులకే ఇస్తున్నాం

"విరాళాల రూపంలో వచ్చే సర్జికల్‌ సామగ్రిని రోగులకే ఇస్తున్నాం. ఫార్మసీకి ఇచ్చి రికార్డుల్లో నమోదు చేయాలని చెబుతున్నాం. మాకు తెలియకుండా ఎవరైనా తీసుకెళ్తుంటే.. దాని గురించి చెప్పలేం..! సెక్యూరిటీ బాధ్యత తీసుకోవాలి. రక్త నమూనాలను ప్రైవేటు వ్యక్తులు వచ్చి తీసుకెళ్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. రెండు రోజుల కిందట సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి బయటకు పంపించాను. ఇకపై రక్త నమూనాలను తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ పంపాలని నిర్ణయించాం." -డాక్టర్‌ రాజేంద్రనాథ్‌, సూపరింటెండెంట్‌

అవన్నీ ఏమైనట్లు?

గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు రూ.కోటి విలువ చేసే సామగ్రి కింగ్‌కోఠి ఆసుపత్రికి విరాళంగా అందింది. వీటిని ఆసుపత్రి ఫార్మసీ రికార్డుల్లో నమోదు చేయకుండానే వినియోగించినట్లు చూపించారు. 2021, మార్చి 31న కిమ్స్‌ ఫౌండేషన్‌ నుంచి రూ.లక్షల విలువ చేసే సర్జికల్‌ సామగ్రి ఆసుపత్రికి అందింది. అవి ఫార్మసీ రికార్డుల్లో నమోదు కాలేదు. ఈ అక్రమాల వెనుక ఓ ఉద్యోగిని పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.


ఇదీ చూడండి:'రెండో దశలో నేరుగా రక్తంలో చేరుతున్న వైరస్'

ABOUT THE AUTHOR

...view details