తెలంగాణ

telangana

ETV Bharat / city

సుప్రీంకోర్టులో జస్టిస్ ఈశ్వరయ్య కేసు విచారణ.. తీర్పు రిజర్వు - supreme Latest News

జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డిల ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది.

eswarayya
సుప్రీంకోర్టులో జస్టిస్ ఈశ్వరయ్య కేసు విచారణ.. తీర్పు రిజర్వు

By

Published : Feb 22, 2021, 10:46 PM IST

ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. జస్టిస్ ఈశ్వరయ్య.. జిల్లా మేజిస్ట్రేట్​తో ఫోన్​లో సుప్రీంకోర్టు జడ్జి, ఏపీ హైకోర్టు సీజేలపై వివాదాస్పదంగా మాట్లాడరన్న అంశంపై ఏపీ హైకోర్టు న్యాయవిచారణకు ఆదేశించింది. ఫోన్ సంభాషణలో కుట్ర కోణం ఉందో.. లేదో తేల్చాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్​.వి.రవీంద్రన్​ను నియమించింది. న్యాయవిచారణకు ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డిల ధర్మాసనం విచారణ జరిపింది.

జస్టిస్ ఈశ్వరయ్య తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ప్రైవేటు సంభాషణపై విచారణకు.. హైకోర్టు ఎలా ఆదేశిస్తుందని వాదించిన ప్రశాంత్ భూషణ్.. సంభాషణ జరిగిన మాట వాస్తవమేనని.. అందులో ఎలాంటి కుట్ర లేదని వాదించారు. కొంతమంది వక్రీకరించిన సంభాషణను ఏపీ హైకోర్టుకు సమర్పించారని.. తర్జుమా చేసిన సంభాషణను అందజేసినట్లు ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కేసులో జోక్యం కోరుతూ.. పలువురు పిటిషన్లు దాఖలు చేయగా వారి తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ప్రశాంత్ భూషణ్ చేసిన తర్జుమాలో వాస్తవాలు లేవని కోర్టుకు తెలిపారు. ఈ దశలో కలుగజేసుకున్న జస్టిస్ అశోక్ భూషణ్.. కుట్రకోణం ఉందో లేదో తేల్చేందుకే కదా ఏపీ హైకోర్టు విచారణకు ఆదేశించిందని... అలాంటి దర్యాప్తును ఎలా ఆపగలమని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు.

తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జ్యుడీషియల్ విచారణకు ఎలా ఆదేశిస్తారని జస్టిస్ ఈశ్వరయ్య తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అడిగారు. ఏపీ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. స్టే ఇవ్వొద్దని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, హరీశ్ సాల్వే కోర్టుకు విన్నవించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆదేశాలు ఇస్తామన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్​పై పిటిషన్లు.. విచారణ రేపటికి వాయిదా

ABOUT THE AUTHOR

...view details