బాణసంచాపై నిషేధం.. ఏ వర్గానికీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఆ ముద్రను సృష్టించే ప్రయత్నం చేయడం సరికాదని పేర్కొంది. అదే సమయంలో ఆనందం పేరిట పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగితే తాము చూస్తూ ఊరుకోమని తెలిపింది.
బాణసంచా నిషేధంపై గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ‘ఆనందం ముసుగులో మీరు (బాణసంచా తయారీదారులు) పౌరుల జీవితాలతో ఆడుకోలేరు. మేం ఒక ప్రత్యేక సముదాయానికి వ్యతిరేకం కాదు. పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు మేం ఇక్కడ ఉన్నామన్న బలమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నాం’’ అని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నల ధర్మాసనం పేర్కొంది.