తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము' - ap sec news

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

'ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము'
'ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము'

By

Published : Jan 25, 2021, 6:08 PM IST

Updated : Jan 25, 2021, 6:18 PM IST

పంచాయతీ ఎన్నికల వాయిదా కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు జరపాలంటూ ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. జగన్​ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్​ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. ఎన్నికల కమిషన్ విధుల్లో తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, హృషికేశ్ రాయ్​లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

రెండు వ్యవస్థల మధ్య అహం సమస్య "న్యాయరాహిత్యం"కు దారి తీస్తోంది. మేము దీనిని అనుమతించలేము. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు ఎలా ఆమోదిస్తారు..?. ఈ అహం యుద్ధంలో మేం భాగం కాలేం. ఇతర వ్యవస్థల స్పర్థలో మేం జోక్యం చేసుకోలేం- విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం.

ఎన్నికలకు వ్యాక్సిన్ అడ్డంకి కాదు.

కరోనా తీవ్రత ఉన్న సమయంలోనూ ఇంతకుముందు ఎన్నికలు జరిగాయని.. కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్​లో సహేతుకత లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి ఈ పిటిషన్​ను అనుమతించబోవడం లేదని చెప్పింది.

ప్రతి ఒక్కరినీ నిందించడం లేదా వారి చర్యలపై తీర్పు చెప్పడం చేయలేం. కొవిడ్ సమయంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. కేరళలో కూడా ఎన్నికలు జరిగాయి. ఇప్పటికీ అక్కడ కేసులు నమోదవుతున్నాయి. దీనికి ఎన్నికలు కారణం అని చెప్పలేం. మేం ప్రతి ఒక్కరి విధుల్లో జోక్యం చేసుకోలేము. కొన్ని రాజకీయ, నిర్ణయాలు ఉంటాయి.. కొన్ని నిర్ణయాలు ఎన్నికల సంఘం తీసుకుంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే.. అసలు సమస్య ఇది కాదని.. మరో విషయం ఏదో ఉందని అర్థమవుతోంది- ధర్మాసనం

ఉద్యోగుల తీరు దారుణం

స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహరించిన తీరును ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. వారి వ్యవహారశైలి దారుణంగా ఉందని వ్యాఖ్యలు చేసింది.

ఎంప్లాయిస్ ఫెడరేషన్, కొంతమంది వైద్య సంఘాల వారు ఇందులో జోక్యం చేసుకోవడం చూస్తుంటే.. ఈ పిటిషన్ కొట్టివేయాలనే మా నిర్ణయానికి మరింత విశ్వసనీయత కల్పించినట్లు అవుతోంది. ఉద్యోగులకు, వైద్యులకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు. వారి జోక్యాన్ని మేం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆ పిటిషన్​ను కొట్టేస్తున్నాం- ధర్మాసనం

ఫిబ్రవరి 28 నాటికి వ్యాక్సిన్ డ్రైవ్ ముగుస్తుందని పేర్కొంటూ మార్చి వరకూ ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ ధర్మాసనాన్ని ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ, ఉన్నత న్యాయస్థానం ఆ అభ్యర్థనను పట్టించుకోలేదు. "ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశానికి మీరు మద్దతు ఇస్తున్నారు.. అందులో ఎలాంటి సహేతుకత కనిపించడం లేదు" అని జస్టిస్ రాయ్ వ్యాఖ్యానించారు.

ఎన్నికలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ సమాంతరంగా జరగాలని హైకోర్టు నిర్ణయం తీసుకోవడం సరైందని కాదని, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆపమని పోలీసులకు చెప్పగలమా అని రోహత్గీ వాదించగా... 'మీ పిటిషన్​ వేసిన తీరే మీ ఉద్దేశాన్ని తెలుపుతోంది. ఉద్యోగులు ఎన్నికల కమిషనర్​ని తప్పుబడుతూ తీర్మానాలు ఎలా చేస్తారు' అని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్​తో తాము వివాదం కోరుకోవటం లేదని రోహత్గీ సర్ది చెప్పపోగా... జస్టిస్ కౌల్ అడ్డుకుని "మీరు వేసిన పిటిషనే ఆ విషయం చెబుతోంది. రమేశ్ కుమార్ పదవీ విరమణ చేశాకే ఎన్నికలు నిర్వహిస్తామని మీరు చెబుతున్నారు. ఇంతకంటే క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎన్నికలు మెరుగ్గా జరిగాయి. అలాంటప్పుడు ఆయనకు వ్యతిరేకంగా తీర్మానాలు ఎలా చేస్తారు" అని ప్రశ్నించారు.

పోలీసులు ఒత్తిడికి గురవుతారు

ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్రంలోని పోలీసులందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని.. కోవిడ్ వాక్సిన్ రవాణా, భద్రత విషయంలోనూ పోలీసులు పాలుపంచుకుంటారని.. అదే సమయంలో ఎన్నికల విధుల నిర్వహించడం వల్ల పోలీసులపై ఒత్తిడి పెరుగుతుందని.. రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్​లో కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. వ్యాక్సినేషన్ జరిగే సమయంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడతాయని.. అది లక్షలాది మంది ప్రాణాలపై ప్రభావం చూపుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్​లో పేర్కొంది.

కొన్నాళ్లుగా "ఎన్నికల పంచాయతీ"

ఏపీ ప్రభుత్వానికి.. ఎస్ఈసీకి మధ్య "ఎన్నికల పంచాయతీ" కొన్నాళ్లుగా నడుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు కమిషన్ సమాయత్తమవగా.. జగన్​ ప్రభుత్వం వివిధ రూపాల్లో అడ్డుకుంటూ వచ్చింది. ఎన్నికల నిర్వహణకు సహకరించేది లేదని తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ జనవరి 9 వతేదీన మొదటి సారి పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ జనవరి 11న కొట్టివేసింది. దీనిపై నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ హైకోర్టు డివిజిన్ బెంచ్​ను ఆశ్రయించారు. జనవరి 21న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్​ల నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వలను రద్దు చేసింది. దీనివల్ల ఏపీలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమం అయింది. ఈలోగానే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం.. తప్పులతో అది తిరస్కరణకు గురై ఒకరోజు ఆలస్యం కావడం.. జరిగాయి. ఈ క్రమంలోనే ఎస్ఈసీ రమేశ్​ కుమార్ మరోసారి పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. సోమవారం నుంచి నామినేషన్లు కూడా తీసుకోవాలి. అయితే ఏపీ ప్రభుత్వం యంత్రాగం ఏ మాత్రం ఎన్నికలకు సహకరించలేదు. జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు విధులకు దూరంగా ఉన్నారు. సుప్రీంకోర్టు.. ఏపీ ప్రభుత్వ పిటిషన్​ను కోట్టేయటంతో ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికలకు మార్గం సుగుమం అయింది.

ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్‌ఈసీ

Last Updated : Jan 25, 2021, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details