గ్రేటర్ నలుమూలల ఆధునాతనమైన ఆసుపత్రులను నిర్మించి.. నిరుపేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం (Telangana Government) భావిస్తోంది. ఇప్పటికే గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, నిమ్స్ వంటి ఆసుపత్రులు నగరం నడిబొడ్డున ఉండి పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. అవన్నీ కూడా గ్రేటర్ పరిధిలో 20 లక్షల జనాభా ఉన్నప్పుడు నిర్మించిన ఆసుపత్రులు. ప్రస్తుతం నగర జనాభా కోటికి పైగా పెరిగిపోయింది. దీంతో మరిన్ని ఆసుపత్రులు వస్తేనే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందవచ్చని సీఎం కేసీఆర్ ఆలోచన చేశారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఇటీవలే నిర్మించిన గచ్చిబౌలీలోని టిమ్స్ ఆసుపత్రిలో కొవిడ్-19 సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో అత్యాధునిక ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి వద్ద, అల్వాల్ వద్ద, ఎల్బీనగర్లోని గడ్డి అన్నారం వద్ద టిమ్స్ ఆసుపత్రులను (Super Speciality Hospitals) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి స్థలాన్ని, అల్వాల్ వద్ద ఉన్న స్థలాన్ని మంత్రులు ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy) , తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు (Talasani Srinivas Yadav)పరిశీలించారు. ఈ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆర్ అండ్ బీ (R AND B) అధికారులు చూసుకుంటున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంపై (Super Speciality Hospitals) సంబంధిత వైద్యాధికారులతో మంత్రులు సమీక్షించారు. త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన కోసం చేయాల్సిన ఏర్పాట్లపైనా సమీక్షించారు. అల్వాల్, గడ్డిఅన్నారం వెళ్లిన మంత్రులు.. అక్కడ కూడా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు పరిస్థితులు ఏమేరకు అనువుగా ఉన్నాయో ప్రత్యక్షంగా పరిశీలించారు. నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి (CM KCR) అందజేస్తామని మంత్రులు (MINISTERS) తెలిపారు.
సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్థల పరిశీలన చేసినట్లు పేర్కొన్నారు. గడ్డి అన్నారంలో సకల సౌకర్యాలతో టిమ్స్ ఆసుపత్రిని నిర్మిస్తామని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. ఇక్కడి పండ్ల మార్కెట్‌ను కొహెడకు తరలించి.. ఆ స్థలంలో రూ.2వేల కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ నిర్మించనున్నట్లు మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.