తెలంగాణ

telangana

ETV Bharat / city

Sundara Naidu Funerals: రేపు రెడ్డిగుంటలో సుందరనాయుడు అంత్యక్రియలు - Sundara Naidu funeral in Chittoor District

Sundara Naidu Funerals: పౌల్ట్రీ దిగ్గజం సుందరనాయుడు అంత్యక్రియలు ఏపీ చిత్తూరు జిల్లాలోని రెడ్డిగుంటలో గల బాలాజీ హేచరీస్‌ ఆవరణలో నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Sundara Naidu Funerals: రేపు రెడ్డిగుంటలో సుందరనాయుడు అంత్యక్రియలు
Sundara Naidu Funerals: రేపు రెడ్డిగుంటలో సుందరనాయుడు అంత్యక్రియలు

By

Published : Apr 29, 2022, 2:43 PM IST

Sundara Naidu Funerals: పౌల్ట్రీ దిగ్గజం సుందరనాయుడు అంత్యక్రియలు ఏపీలో చిత్తూరు జిల్లాలోని రెడ్డిగుంటలో గల బాలాజీ హేచరీస్‌ అవరణలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు చిత్తూరు సమీపంలోని రెడ్డిగుంటలో ఉన్న ఆయన స్వగృహానికి పార్థివదేహం రానున్నట్లు సోదరుడి కుమారుడు రమేష్‌ తెలిపారు. ప్రజల సందర్శనార్థం స్వగృహంలో రేపు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంచనున్నట్లు తెలిపారు. తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని తెలిపారు.

Uppalapati Sundar Naidu Passed Away: బాలాజీ హేచరీస్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి పార్థివ దేహాన్ని చిత్తూరుకు తరలించారు. సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పశు వైద్యుడిగా వృత్తిని ప్రారంభించిన ఆయన.. కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి అపార కృషి చేశారు. ఉమ్మడి ఏపీలో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. చిత్తూరులో బాలాజీ హేచరీస్‌ స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఔత్సాహికులకు దార్శనికుడిగా నిలిచారు.

ఏపీ పౌల్ట్రీ:ఉప్పలపాటి సుందరనాయుడు(Sundar Naidu Uppalapati) 1936 జులై 1న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కంపలపల్లెలో జన్మించారు. నాన్న గోవిందునాయుడు, అమ్మ మంగమ్మలకు సుందరనాయుడుతో కలిపి మొత్తం ఐదుగురు సంతానం. అందరూ కలసి జీవించే ఉమ్మడి కుటుంబం వీరిది. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుందరనాయుడు టి.పుత్తూరు పాఠశాలలో ప్రాథమిక విద్య, అరగొండ జడ్పీ హైస్కూల్‌లో ఉన్నత పాఠశాల విద్య, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత బొంబాయి వెటర్నరీ యూనివర్సిటీలో బీవీఎస్సీ పూర్తి చేశారు. చదువులో చురుగ్గా ఉండే సుందరనాయుడు.. తన గ్రామంలోని యువతను చైతన్య పరచడానికి నేతాజీ బాలానంద సంఘాన్ని స్థాపించి, గ్రంథాలయాన్ని, క్రీడా పరికరాలను సమకూర్చారు. గ్రామస్థుల సహకారంతో సంఘానికి శాశ్వత భవనాన్ని నిర్మించారు. విద్యార్థి దశ నుంచే సమాజ సేవా దృక్పథం, సమైక్య భావన సుందరనాయుడికి అలవడింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. 1964 డిసెంబరు 9న ఆయనకు సుజీవనతో వివాహం జరిగింది. శైలజ, నీరజలు ఇద్దరు కుమార్తెలు. శైలజా కిరణ్‌.. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పెద్ద కోడలు, మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు మేనేజింగ్‌ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు.

బి.వి.రావుతో అనుబంధం: దేశ పౌల్ట్రీ రంగ మార్గదర్శకుడైన బి.వి.రావుతో సుందర నాయుడికి సన్నిహిత సంబంధం ఉండేది. పరిశ్రమ ప్రారంభ దశలో ఇతర వ్యాపారులు గుడ్ల ఉత్పత్తులపైనా, గుడ్ల ధరలపైనా తమ పట్టు బిగించి పరిశ్రమను తమ గుప్పిట్లో బంధించారు. రైతులకు రావాల్సిన లాభాలు దళారులుగా మారిన వ్యాపారుల పరమయ్యేవి. ఈ సమస్యను అధిగమించడానికి బి.వి.రావుతో కలిసి సుందర నాయుడు దేశం నలుమూలలా తిరిగారు. ‘నా గుడ్డు- నా జీవితం- నా ధర’ నినాదంతో విస్తృతంగా ప్రచారం చేశారు. దాని పర్యవసానంగా నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటైంది.

పశువైద్యుడిగా జీవితం ప్రారంభించి..:బీవీఎస్సీ పూర్తయిన తర్వాత కొంతకాలం చిత్తూరు జిల్లా పీలేరులో పశు వైద్యుడిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేశారు. 1964 డిసెంబర్ 9న సుందరనాయుడికి పెమ్మసాని సుజీవనతో వివాహం జరిగింది. అనంతరం చిత్తూరు, అనంతపురం, కృష్ణగిరి(తమిళనాడు)జిల్లాల్లో పశు వైద్యుడిగా విశేష సేవలందించారు. ఈ క్రమంలోనే అక్కడి రైతులకు దగ్గరయ్యారు. రైతుల జీవితాలను దగ్గరి నుంచి చూసిన ఆయనకు పెద్ద సమస్యే కనిపించింది. పంటలు పండక, పండినా గిట్టుబాటు ధర రాక రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశారు. వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం ఉంటే రైతుల సమస్యలు తగ్గుతాయని భావించారు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే కోళ్ల పెంపకం.

ఉద్యోగానికి రాజీనామా చేసి.. :పరిశ్రమ ప్రారంభిస్తే ఎంతో మందికి ఉపాధి కల్పించ వచ్చనే కోరిక క్రమంగా బలపడటంతో, కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంప్రదించిన తర్వాత సుందర నాయుడు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1967లో కోళ్ల పరిశ్రమ స్థాపనకు నాంది పలికారు. కోళ్ల ఫారాల గురించి ఎంతో మంది రైతులకు అవగాహన కల్పించారు. స్వయంగా కాలినడకన అనేక ఊళ్లు తిరిగారు. కోళ్లకు వైద్యం సహాయం అందిస్తానని భరోసా ఇవ్వడంతో రైతులు సైతం కోళ్ల ఫారాలు పెట్టేందుకు ముందుకు వచ్చారు. సుందరనాయుడిపై నమ్మకంతో ఇటువైపు వచ్చిన రైతులకు సరికొత్త ఉపాధి దొరికింది. పదుల సంఖ్యలో ప్రారంభమైన కోళ్ల ఫారాలు మూడేళ్లు తిరిగే సరికి వందల సంఖ్యకు చేరింది. కోళ్ల ఫారాలు ప్రారంభించినప్పటికీ కోడి పిల్లల దిగుమతి సమస్యగా మారింది. ఆ కొరతను తీర్చడానికి సుందరనాయుడు మరో అడుగు ముందుకు వేశారు. 1972లో ‘బాలాజీ హేచరీస్‌’ స్థాపించి పౌల్ట్రీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు.

ఎన్నో గౌరవాలు..:పౌల్ట్రీ రంగానికి సుందరనాయుడు చేసిన కృషిగానూ అనేక అరుదైన గౌరవాలు అందుకున్నారు. పుణెలోని డాక్టర్‌ బీవీరావు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపక ట్రస్టీగా వ్యవహరించారు. ‘నెక్‌’ జీవిత కాల ఆహ్వాన సభ్యుడిగా, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్‌ శాశ్వత ఆహ్వాన సభ్యుడిగా, అంతర్జాతీయ పౌల్ట్రీ సైన్స్‌ అసోసియేషన్‌ సభ్యుడిగా, ఎగ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగానూ విశేష సేవలందించారు. అంతేకాదు, న్యూజెర్సీ ప్రభుత్వం ‘డూయర్‌ ఆఫ్‌ ద పౌల్ట్రీ ఇన్‌ సౌత్‌ ఇండియా’ అవార్డుతో సుందరనాయుడిని సత్కరించింది.

సంబంధిత కథనాలు:

ABOUT THE AUTHOR

...view details