Summer Effect in AP: తెలుగు రాష్ట్రాల్లో ఎండాకాలం ప్రభావం మొదలైంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 39 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరాయి. ముఖ్యంగా ఏపీలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. రాత్రి 8 గంటలైనా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ సుర్రుమంటోంది. ఎండ వేడిమి, ఉక్కపోత నేపథ్యంలో ఏసీల వాడకమూ అధికమైంది.
Temperature Rise: మండుతున్న ఎండలు.. 39 డిగ్రీల ఉష్టోగ్రత - SUMMER EFFECT BEGAN IN TELUGU STATES
తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెగ మొదలైంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 39 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరాయి. ఈ ఏడాది ఎండలు 43 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ముఖ్యంగా ఏపీలోని ఉత్తర కోస్తాలో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తు అంచనాల్లో వెల్లడించింది.
ఉష్ణోగ్రతలు రెండు మూడు రోజులుగా సాధారణం కంటే కొంత పెరగ్గా.. ఈ వారంలో మరింత అధికం కావొచ్చని వాతావరణ విభాగం అంచనాలు సూచిస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఈ వేసవిలో (మార్చి నుంచి మే వరకు) సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణశాఖ ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి. కొన్నిరోజుల పాటు ఎండల తీవ్రత పెరగడం, తర్వాత తగ్గడం వల్ల సగటున సాధారణంగానే ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఉత్తర కోస్తాలో అధిక ఎండలు
వేసవిలో ఉత్తర కోస్తాలో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తు అంచనాల్లో వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణంగా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా ఎండలు ఉంటాయని అంచనా వేసింది. ప్రస్తుతం కడప జిల్లాలో సాధారణం కంటే తక్కువ వేడి కనిపిస్తోంది. ఈ నెల 14, 15 తేదీల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల స్థాయికి చేరవచ్చని కేఎల్ విశ్వవిద్యాలయ వాతావరణ విభాగం అంచనా వేసింది. 15న విజయవాడలో 43.1 డిగ్రీలకు చేరవచ్చని, అమరావతి, ఏలూరు, గుంటూరు ప్రాంతాల్లో ఎండలు ఇంకా ముదురుతాయని పేర్కొంది. తిరుపతి, నెల్లూరు, అనంతపురం, ఒంగోలు తదితర ప్రాంతాల్లో 33 డిగ్రీల నుంచి 38.3 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపింది. తెలంగాణలోని ఖమ్మంలో ఉష్ణోగ్రతల ప్రభావం పెరుగుతుందని పేర్కొంది.