తెలంగాణ

telangana

ETV Bharat / city

లాక్‌డౌన్‌ ప్రభావం: ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ జీవనం.. - ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూన్న కూలీలు

రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు.. పొద్దస్తమానమూ కష్టించి సంపాదిస్తేనే నాలుగు డబ్బులు చేతికొచ్చేది. అలా వచ్చిన కూలీతోనే ఇంట్లోని నలుగురూ కడుపు నింపుకొనేది. కరోనా మహమ్మారి కమ్మిన వేళ.. పరిస్థితి తారుమారు.. బస్తీలో బతుకు సవాల్‌గా మారింది. చేసేందుకు పనుల్లేక.. ఇల్లు కదిలే వీల్లేక.. చేతిలో చిల్లిగవ్వలేక నగరంలోని బస్తీవాసులు ఈ రోజు గడిస్తే చాలు అన్నట్లుగా గడుపుతున్నారు. దుర్గానగర్‌, బతుకమ్మకుంట, బర్కత్‌పుర ప్రాంతంలోని రత్ననగర్‌ బస్తీవాసుల స్థితిగతులపై ఈటీవీ భారత్‌ ప్రత్యేక కథనం

sulm people of hyderabad face finacial problems
ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ జీవనం

By

Published : Apr 21, 2020, 10:09 AM IST

రిక్షా కార్మికులు, స్వచ్ఛ ఆటోలు నడిపేవారు, ఇళ్లల్లో పనులు చేసుకునేవారు, కూలీలు, తోపుడుబండ్ల వ్యాపారులు, తుక్కు విక్రయించేవారు, భవన నిర్మాణ కార్మికులు, పరిశ్రమల కార్మికులు.. ఇలాంటి వారే నగరంలోని బస్తీల్లో నివసించేది. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లల్లోనే రోజంతా తలదాచుకోవాల్సిన పరిస్థితి. ఇరుకు వీధులకుతోడు నాలాల పక్కన అపరిశుభ్రత నడుమ జీవనం సాగిస్తున్నారు.

మురికివాడలపై దృష్టి పెట్టాలి..

ముంబయిలోని ధారావిలో పదుల సంఖ్యలో స్థానికులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈ పరిస్థితుల్లో నగరంలోని మురికివాడల్లోనూ ఉంటున్న ప్రజలపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. బస్తీల్లో ఒకేచోట పెద్దసంఖ్యలో నివసిస్తున్నారు. రెండు గదుల ఇంట్లో భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు.. ఇలా అయిదారుగురు జీవిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న బియ్యం, రూ.1500 చాలా వరకు ఆదుకుంటోంది. కొందరికి రేషను కార్డులు లేక బియ్యం అందలేదు. బ్యాంకు ఖాతా లేక ఆర్థిక సాయం రాలేదని వాపోతున్నారు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అడపాదడపా సాయం అందిస్తుండటం ఊరట కలిగిస్తోంది.

అద్దె వసూలులో ఆదర్శం..

రత్ననగర్‌ బస్తీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు మురళీకృష్ణ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తన ఇంట్లో నాలుగు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయని, వారి నుంచి సగం అద్దె మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మిగిలిన యజమానులు ఇదే తరహాలో అద్దెలో రాయితీ ఇవ్వాలని ఆయన కోరారు.

నగరంలో బస్తీలు 1400..

‘‘నేను ఇళ్లలో పనిచేస్తుంటాను. ఆ వచ్చిన డబ్బులతోనే ఇల్లు గడిచేది. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి పనికి రానివ్వడం లేదు. దీంతో పూటగడవడం కష్టంగా ఉంది. కూలీ పనులు చేసుకుందామంటే అవి కూడా లేవు. రేషను కార్డు లేదు. అప్పులు చేసి బియ్యం, పప్పులు, కాయగూరలు కొనుక్కొని తింటున్నాం. - బర్కత్‌పుర రత్ననగర్‌ బస్తీకి చెందిన వజ్రమ్మ ఆవేదన

చేతిలో చిల్లిగవ్వ లేదు..

‘‘నేను సెంట్రింగ్‌ పనికి వెళ్లేవాడ్ని. రోజుకు రూ.600 కూలీ వచ్చేది. నెలరోజులుగా పనులన్నీ బంద్‌ అయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇంట్లో నలుగురం ఉంటున్నాం. నా సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పనుల్లేక ఒక్కోపూట పస్తులుంటున్నాం. బియ్యం ఇచ్చినా కూరగాయలు, పప్పులు కొనుక్కొనే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నాం.’’ - జంగయ్య , గోల్నాక దుర్గానగర్‌ బస్తీవాసి

ఇదీ చదవండి:సిద్ధిస్తున్న స్వప్నం.. లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు

ABOUT THE AUTHOR

...view details